రాజు గారి కోటలో మాజీ మంత్రి...టీడీపీ కొత్త ప్రయోగం...?
ఇదిలా ఉంటే విజయనగరం ఎంపీ సీటు మీద పూసపాటి రాజా వారు, కేంద్ర మాజీ మంత్రి అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశలు పెట్టుకున్నారు
By: Tupaki Desk | 4 Sep 2023 5:30 PM GMTప్రతిష్టాత్మకమైన విజయనగరం లోక్ సభ సీటు నుంచి మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ అయిన కిమిడి కళా వెంకటరావుని పోటీ చేయించాలని టీడీపీ అధినాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో పట్టు ఉన్న నేతగా కళా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన రాజాం నియోజకవర్గం కొత్త జిల్లాల ఏర్పాటుతో విజయనగరంలో కలసిపోయింది. దాంతో కళాను ఎంపీ క్యాండిడేట్ గా పోటీకి దింపితే గెలుపు ఖాయమని టీడీపీ హై కమాండ్ భావిస్తోందిట.
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తూర్పు కాపులు బీసీలు ఎక్కువ. అదే సామాజికవర్గానికి చెందిన కళాను దించడం ద్వారా సామాజిక సమీకరణలను కూడా సరిచూసుకోవచ్చు అని టీడీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో ఇదే సీటు నుంచి తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్ వైసీపీ తరఫున విజయం సాధించారు. ఆయన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు బంధువు కూడాను.
ఇదిలా ఉంటే విజయనగరం ఎంపీ సీటు మీద పూసపాటి రాజా వారు, కేంద్ర మాజీ మంత్రి అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశలు పెట్టుకున్నారు. ఆయన తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయాలని అనుకున్నారు. అదే విధంగా తన కుమార్తె రాజకీయ వారసురాలు అయిన అదితి గజపతిరాజుని విజయనగరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్నారు.
నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ అధినాయకత్వం అదే చేసింది. అయితే రెండు చోట్లా తండ్రీ కుమార్తెలు ఓటమి పాలు అయ్యారు. వైసీపీ ప్రభంజనంలో ఈ పరిణామం జరిగింది. కానీ ఈసారి పరిస్థితులలో మార్పు కనిపిస్తోంది కాబట్టి కచ్చితంగా రెండు సీట్లూ గెలుచుకుంటామని రాజా వారు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అశోక్ ని ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరారని అంటున్నారు. అయితే తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అడిగినట్లుగా ప్రచారంలో ఉంది.
కానీ బాబు మాత్రం కళా వెంకటరావు అభ్యర్ధిత్వం పట్ల మొగ్గు చూపారని అంటున్నారు. ఆయనను పోటీకి దించితే ఎంపీ సీటుతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో కూడా పార్టీ విజయావకాశాలు మెరుగు అవుతాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ పరిణామం చూస్తే రాజు గారి కోటలో కళా పాగా వేసినట్లుగా ఉందని అంటున్నారు. నిజానికి శ్రీకాకుళం జిల్లాలోనే దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తూ వచ్చిన కళాను వ్యూహాత్మకంగా గా బాబు విజయనగరం జిల్లాకు పంపిస్తున్నారు అని అంటున్నారు.
అక్కడ అచ్చేన్న వర్సెస్ కళాగా పాలిటిక్స్ సాగుతోంది. దాన్ని నివారించేందుకు ఆయనను ఇలా షిఫ్ట్ చేశారు అని అంటున్నారు. ఇక అశోక్ గజపతి రాజు జిల్లాలో కళా పాతుకుపోతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ పరిణామాలు అశోక్ బంగ్లాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు.