Begin typing your search above and press return to search.

టీడీపీకి ఎంత మంది వ్యూహకర్తలు.. రాబిన్ శర్మ అసహనం...!?

టీడీపీ ఎవరినీ నమ్మడం లేదా. ఆరాటం పోరాటంగా ఆ పార్టీ పరిస్థితి ఉందా. జనాల నాడిని పట్టుకోవడానికి విశేష అనుభవం కలిగిన చంద్రబాబు చాలరా

By:  Tupaki Desk   |   20 April 2024 3:44 AM GMT
టీడీపీకి ఎంత మంది వ్యూహకర్తలు.. రాబిన్ శర్మ అసహనం...!?
X

టీడీపీ ఎవరినీ నమ్మడం లేదా. ఆరాటం పోరాటంగా ఆ పార్టీ పరిస్థితి ఉందా. జనాల నాడిని పట్టుకోవడానికి విశేష అనుభవం కలిగిన చంద్రబాబు చాలరా. వ్యూహకర్తలు మాకు ఎందుకు అని ఒకనాడు అన్న టీడీపీ 2024 ఎన్నికల వేళకు మాత్రం ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు తో పనిచేయిస్తోంది అని అంటున్నారు.

దానికి కారణం రాబిన్ శర్మ మీద నమ్మకం సన్నగిల్లడమే అంటున్నారు. రాబిన్ శర్మ కరోనా అనంతరం తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు అందించేందుకు రంగంలోకి వచ్చిన వారు. ఆయన గత మూడేళ్ళుగా టీడీపీకి వ్యూహాలను అందిస్తూ వచ్చారు. బాదుడే బాదుడు అంటూ కరోనా టైం తరువాత ఆయన ఇచ్చిన మొదటి ప్రోగ్రాం బాగానే సక్సెస్ అయింది. ఆ తరువాత ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అన్న మరో కార్యక్రమం మాత్రం సో సోగా సాగింది.

ఇక ఆనాటి నుంచి ఆయన ఎన్నికల వ్యూహాలలో నిమగ్నం అయ్యారు. గత ఏడాదిగా ఆయన ప్రతీ అసెంబ్లీ సీటులో తెలుగుదేశం అలాలు అలాగే బలహీనతలు అన్నీ గుదిగుచ్చి చెబుతూ వచ్చారు.ఫలనా అభ్యర్ధికి టికెట్ ఇవ్వండి అని సూచించారు. అయితే టీడీపీ కూటములు కట్టింది. అందులో బీజేపీ జనసేన వచ్చాయి. సీట్ల సర్దుబాటులో రాబిన్ శర్మ సూచించిన వారికి కాకుండా వేరే వారికి టికెట్లు వెళ్లాయి. కొన్ని చోట్ల సీట్లే మారిపోయాయి.

దీంతో రాబిన్ శర్మ అయితే కూటమి విజయావకాశాల మీద డౌట్ వ్యక్తం చేశారని ఇలాగైతే కష్టం అని చెప్పేశారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. జనసేన, బీజేపీకి కేటాయించిన 31 సీట్లలో 5 కు మించి గెలిచే పరిస్థితి లేదని ఆయన అన్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అలాగే జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదని తేల్చేశారు అంటున్నారు. అదే విధంగా మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలని ఆయన ముందుంచారు అని అంటున్నారు.

ఇక క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకోనప్పుడు మేమెందుకు అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. తమ ప్రయత్నాలు అంతా వృథా అయ్యాయని ఆయన చెప్పారని అంటున్నారు. అయితే రాబిన్ శర్మ అసహనానికి మరో కారణం ఉంది అని అంటున్నారు. ఆయన పనిచేస్తుండగానే పీకే ఉరఫ్ ప్రశాంత్ కిశోర్ ని రంగంలోకి దించారని ఆయన సలహా సూచనలు కూడా ఇస్తూండడంతో రాబిన్ శర్మ టీం కి మంటెత్తుతోందని అంటున్నారు. పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్‌ బృందం అని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చాలదు అన్నట్లుగా తెలంగాణాలో కాంగ్రెస్ విజయానికి పనిచేసిన సునీల్ కనుగోలుని కూడా ఏపీలో టీడీపీ సేవలకు వాడుకుంటున్నారు అని అంటున్నారు. దీంతో ముగ్గురు వ్యూహకర్తలు టీడీపీకి ఇపుడు ఉన్నట్లు అయింది. వారు ఏ విజయతీరాలకు పార్టీని చేరుస్తారు అన్నది చూడాల్సి ఉంది.