Begin typing your search above and press return to search.

టీడీపీని బదనాం చేస్తోంది ఎవరు...?

మొత్తానికి చంద్రబాబు చంటిపాపలా చూసుకున్న టీడీపీని అయిన వారు మిత్రులు పార్టీలో సీనియర్లు అంతా కలసి తలో విధంగా బదనాం చేసి పారేశారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:54 PM GMT
టీడీపీని బదనాం చేస్తోంది ఎవరు...?
X

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఎన్టీయార్ చేతుల మీదుగా పుట్టిన పార్టీ అయినా టీడీపీని చంద్రబాబు తన చేతులతో ఎత్తుకుని పెంచారు. పార్టీని ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. చంద్రబాబు జీవితంలో టీడీపీది అతి ముఖ్య పాత్ర. ఆయన ఎపుడూ పార్టీ గురించి ఆలోచించని సందర్భం లేదు. ఆయన దశాబ్దాల జీవితంలో టీడీపీని వీడి ఎపుడూ దూరంగా లేరు.

అలాంటి చంద్రబాబు విధివశాత్తు జైలు జీవితం అనుభవిస్తున్నారు. దాదాపుగా నెల రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలు గోడల మధ్య ఉన్నారు. బాబు లేని వేళ టీడీపీని పటిష్టం చేయాల్సింది పోయి బదనాం చేస్తున్నారు అన్న చర్చ అయితే ఉంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మాటే వేదవాక్కు. ఆయన పార్టీ నేతలు అందరికీ దిశా నిర్దేశం చేస్తూ మీడియా ముందు మాట్లాడించేవారు.

దాంతో పార్టీలో ఒక కట్టుబాటు విధానం ఉండేది. అదే విధంగా టీడీపీగా ఒక మాట అంటే ఏ వర్గాలు దగ్గర అవుతాయి లేక ఏదైనా విమర్శ చేస్తే ఏ వర్గం దూరం అవుతుంది ఇవన్నీ బాబుకు బాగా తెలుసు.అందుకే ఆయన ఆచి తూచీ మాట్లాడేవారు. పార్టీ జనాల చేత అలాగే మాట్లాడించేవారు

కానీ బాబు లేని టైం చూసి పార్టీ నేతలు ఎవరికి వారుగా చేస్తున్న కామెంట్స్ విమర్శలు టీడీపీని కేవలం నెల రోజుల వ్యవధిలోనే బదనాం చేసి పారేశాయి అన్న భావన ఏర్పడింది. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా తోచిన తీరున మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంతో టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.

లేటెస్ట్ ఎపిసోడ్ తీసుకుంటే మాజీ మంత్రి దాదాపుగా ఏడు పదులకు చేరువ అవుతున్న బండారు సత్యనారాయణమూర్తి. ఆయన మహిళా మంత్రి రోజాను పట్టుకుని బూతులే మాట్లాడారు. దానికి గానూ ఆయన మీద కేసులు పడ్డాయి. బెయిల్ మీద వచ్చారు. అయినా కూడా తనదే పై చేయి అనేలా వ్యవహరిస్తున్నారు.

ఇపుడు రోజాకు మద్దతుగా సీనియర్లు నటీమణులు రంగంలోకి వచ్చారు. ఖుష్బూ, రాధిక వంటి వారు బండారు వ్యాఖ్యల మీద చాకి రేవు పెడుతున్నారు. పెద్దాయనగా మనిషిగా ఉండు కుటుంబం మనిషిగా ఉండు అని హిత బోధ చేస్తున్నారు. మీ ఇంట్లో ఆడవారు ఉన్నారు కదా వారిని ఇలాగే అనుమానిస్తారా అంటూ సీనియర్ నటి రాధిక చేసిన విమర్శ బండారుకే కాదు టీడీపీకీ తగులుతోంది. టీడీపీ వంటి గౌరవనీయమైన పార్టీలో ఉంటూ ఈ లేకి మాటలు లో పాలిటిక్స్ ఏంటి బండారూ అని రాధిక కడిగేశారు.

ఈ విషయం ప్రధాని దృష్టికి తెస్తామని కూడా అంటున్నారు. బండారు నోటి దురద కాస్తా ఇపుడు టీడీపీకి చుట్టుకుంటోంది. మహిళలు బయటకు రావద్దా వారిని అన్నేసి మాటలు అంటారా అంటూ రాధిక విరుచుకుపడిన విధానం కానీ టీడీపీ ద్వారా ఎంతో మంది నాయకులు బయటకు వచ్చారని అలాంటి పార్టీలో ఒక బండారు ఉన్నారని ఆమె విమర్శించడాన్ని చూస్తే టీడీపీకి బండారు చేసిన డ్యామేజ్ ఏంటో అర్ధం అవుతుంది.

ఒక విధంగా ఇది వైసీపీని ఆయాచితంగా ఆయుధంగా మారుతోంది. టీడీపీలో పెద్దాయనగా ఉంటూ బండారు చంద్రబాబు లేని టైం లో చేసిన నిర్వాకం ఇది అంటున్నారు. ఇక టీడీపీ వారు కొందరు కొన్ని చోట్ల దీక్షలలో చిన్న పిల్లలను పెట్టి మీడియా ముందు వైసీపీని బండ బూతులు తిట్టిస్తున్నారు. అంతే కాదు ఎపుడో చనిపోయిన వైఎస్సార్ ని కూడా తిట్టిస్తున్నారు. వైసీపీ మీద కోపం ఉంటే ఉండొచ్చు. దివంగత నేత వైఎస్సార్ ఏమి చేసారు అన్నది చూడాలి కదా.

వైఎస్సార్ ఏపీ జనాలకు దేవుడితో సమానం. ఆయన పేదల పక్షపాతి. అలా వైఎస్సార్ మీద నోరు చేసుకోవడం వల్ల టీడీపీకి నష్టమే తప్ప లాభం ఏమీ సమకూరదు అంటున్నారు. పైగా ఒక బలమైన సామాజికవర్గం కూడా వైఎస్సార్ మీద ఇలా టీడీపీ నేతలు తిట్టించడాన్ని చూసి మండిపోతోంది. చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకోవాలని చూసారు. వైఎస్సార్ నా మిత్రుడు అని కూడా చెప్పుకున్నారు.

అలా బాబు రాజనీతి వ్యూహాలు ఉంటే దాన్ని పలుచన చేస్తూ దీక్షల పేరుతో తమ్ముళ్ళు చెలరేగిపోతూ టీడీపీ ఓటు బ్యాంక్ కి గండి పెడుతున్నారు. ఇక బాబుతో కొత్తగా పొత్తులు కుదుర్చుకున్న పాత మిత్రుడు పవన్ కళ్యాణ్ అయితే ఫ్లోలో చెప్పాలో లేక మరోలా అన్నారో తెలీయ్దు కానీ టీడీపీ వీక్ అయింది అంటూ ఏకంగా బహిరంగ సభలలో మాట్లాడుతూ ఆ పార్టీ ఇజ్జత్ ని తీసేశారు. ఇది కూడా ఇపుడు వైసీపీకి ఆయుధంగా మారుతోంది.

ఒక్క చంద్రబాబు కొన్ని రోజులు జైలులో ఉన్నంత మాత్రాన టీడీపీ పని అయిపోయినట్లా అన్న చర్చ కూడా బయల్దేరింది. ఇక జనాలలో ఇది ఏ రకమైన సందేశం ఇస్తుంది అన్నది కూడా చూడాలి అంటున్నారు. బావమరిది కం వియ్యంకుడు బాలయ్య అయితే సినీ రంగాన్ని అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్ ని పట్టుకుని మరీ డోంట్ కేర్ అనేశారు. అలా పెద్ద మాట మాట్లాడేసి బలమైన వర్గాలను హర్ట్ చేసారు. జూనియర్ ఎన్టీయార్ టీడీపీ సొమ్ము అని ఆయన ఎపుడైనా వస్తారు అని భావించే వారి ఆశలకు అలా బాలయ్య తన రాజకీయ అవగాహన లేమితో గండి కొట్టేసారు అంటున్నారు.

ఇంకో వైపు లోకేష్ కూడా చేయాల్సింది చాలానే చేశారని అంటున్నారు. ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ స్కిల్ స్కాం లో కింది స్థాయి వారు తప్పులు చేస్తే పై వారిని నిందిస్తారా అని నోరు జారేసి స్కాం ఉందని ఒప్పుకున్నట్లు అయింది అంటున్నారు. అంతే కాదు ఆయన గత పాతిక రోజులుగా ఢిల్లీలో ఉంటూ పార్టీని గాలికి వదిలేసి చాలా పెద్ద డ్యామేజ్ చేసారు అంటున్నారు.

మొత్తానికి చంద్రబాబు చంటిపాపలా చూసుకున్న టీడీపీని అయిన వారు మిత్రులు పార్టీలో సీనియర్లు అంతా కలసి తలో విధంగా బదనాం చేసి పారేశారు అని అంటున్నారు. మరి చంద్రబాబు బయటకు వచ్చాక ఏ రకమైన రిపేర్లు చేసుకుంటారో చూడాల్సి ఉంది.