వాలంటీర్ వార్...టీడీపీ సెల్ఫ్ గోల్ ...!?
ఆ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది తప్పు అని ఎందుకు ఖండించ లేకపోతోంది.
By: Tupaki Desk | 2 April 2024 3:43 AM GMTవాలంటీర్ వ్యవస్థ మీద నాలుగున్నరేళ్లుగా విషం చిమ్మింది టీడీపీ. ఇపుడు ఏదో స్వచ్చంద సంస్థ ఫిర్యాదు మేరకు వాలంటీర్లను ఈసీ విధులకు దూరంగా ఉంచిందని అంటోంది. కానీ ఆ స్వచ్చంద సంస్థలో ఉన్న వ్యక్తులు వారికి టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం చూసిన వారు ఎవరైనా ఇది టీడీపీ పని కాదు అని అనుకోకుండా ఉండగలరా. సరే టీడీపీ వాలంటీర్లను విధుల నుంచి దూరం చేయడాన్ని కోరుకోలేదు అనుకుంటే
ఆ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది తప్పు అని ఎందుకు ఖండించ లేకపోతోంది. వాలంటీర్లను విధులలో కొనసాగించాలని ఈసీకి ఎందుకు లేఖ రాయలేకపోతోంది. అంటే ఇది టీడీపీకి ఇష్టమైన చర్యగానే ఉంది కదా.
అక్కడే టీడీపీ దొరికేస్తుంది అని అంటున్నారు. అంతే కాదు టీడీపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది అని అంటున్నారు. అదెలా అంటే ఏ వ్యవస్థ మీద అయినా జనాల ప్రభావం ఏమిటి అన్నది గుర్తించనంతగా వాలంటీర్ల వ్యవస్థ టీడీపీకి నచ్చకపోవచ్చు.
కానీ అది పేదలు ఎక్కువగా ఉన్న కుటుంబాలకు సేవను అందిస్తోంది. ఒక అతి పెద్ద డోర్ డెలివరీ సిస్టం గా మారింది. దాని వల్ల లాభాలను పొందుతున్న వర్గాలు సమాజంలో ఉన్నాయి. వారిని చూసి అయినా టీడీపీ తన రాజకీయ కోణాన్ని కాస్తా పక్కన పెట్టి ఆలోచించవచ్చు కదా. ఒక వైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇంతకంటే మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెబుతూ మరో వైపు చూస్తే వారి మెడ మీదనే కత్తిని వేలాడతీయడాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అన్న ఆలోచన చేయకపోవడమే పెద్ద తప్పు.
ఇక టీడీపీ వాలంటీర్ల వెనక ఉన్న అవ్వా తాతలు అలాగే అక్షరాలా అరవై ఆరు లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలుసుకుని ఆ మీదట జరగబోయే అతి పెద్ద రాజకీయ నష్టాన్ని ఊహించుకుని తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమానికి సిద్ధపడింది. సీఎస్ వద్దకు తెలుగుదేశం టీం వెళ్లి పెన్షన్లు అందరికీ వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
దాని కంటే ముందు చంద్రబాబు సీఎస్ కి లేఖ రాశారు. అంతే కాదు బాబు తన ప్రజా గళం సభలను రద్దు చేసుకుని మరీ హుటాహుటిన హైదరాబాద్ వచ్చి టీడీపీ తమ్ముళ్లతో టెలి కాన్ఫరెన్స్ పెట్టి మరీ వైసీపీయే పెన్షన్ ఇవ్వకుండా ఇలా నాటకం ఆడుతోందని జనంలోకి వెళ్లి చెప్పమంటోంది.
కానీ దెబ్బ తిన్న వారు అవ్వా తాతలు. వాలంటీర్లు. వారికి తెలుసు కదా అసలు ఏమి జరిగిందో. రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు చెల్లుతాయి. కానీ అతి పెద్ద జన సమూహంతో వారి ప్రయోజనాలతో చెలగాటం ఆడితే అపుడూ అగ్ని జ్వాలలుగా ఎగిసే మంటలుగా మారుతాయని గుర్తెరగపోవడమే చిత్రం.
అంతే కాదు దానికి కౌంటర్ ప్రచారం ఎంత చే సినా అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ చిన్న బకెట్ తో నీటిని పోసి ఆర్పే ప్రయత్నం చేస్తే కుదరదు అని కూడా అర్ధం అవుతోంది. ఏది ఏమైనా ఇది టీడీపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అంటున్నారు. ఇపుడు లబ్దిదారులకు ఒక ట్రైలర్ చూపించినట్లు అయింది.
టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాగే జరుగుతుందన్న భయాన్ని వారిలో కలిగించినట్లు అయింది. అలాగే వాలంటీర్ల వంటి చిరు ఉద్యోగులకు తమ ఉపాధికి గండి పడుతుందని కూడా చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇంత విషయం అర్ధమయ్యాక వారు ఏమి చేస్తారో అన్న భయం అయితే కచ్చితంగా టీడీపీలో ఉండి తీరుతుంది కదా మరి ఏప్రిల్ ఒక్క నెల కూడా కాదు, మే లో కూడా ఇలాగే జరుగుతుంది. ఎన్నికల ముంగిట మండే మే ఎండలలో వృద్ధులు పేదలు రోడ్ల మీద పెన్షన్ కోసం పడిగాపులు పడుతూంటే వారి ఆవేశం ఏ విధంగా ఎవరి మీదకు తిరగబడుతుందో కూడా చూడాల్సిందే.