సీనియర్లకు నో ఆప్షన్... బాబు ధీమా అదే...!
ఉత్తరాంధ్రాలో చూసుకుంటే మాజీ మంత్రులు గుండా అప్పల సూర్యనారాయణ ఫ్యామిలీని పక్కన పెట్టేశారు
By: Tupaki Desk | 22 March 2024 5:30 PM GMTటీడీపీ అధినేత చాలా వ్యూహాత్మకంగా ఈసారి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ ఎంపిక చూస్తే గతంలో బాబు మొహమాటాలకు పోతూ రాజీపడుతూ చేసిన సెలెక్షన్స్ ఏవీ ఇపుడు లేనే లేవు అని అంటున్నారు. ఎంతటి బలవంతుడైన లీడర్ అయినా సీనియర్ అయినా బాబు వారిని తీసి పక్కన పెట్టేశారు. దానికి కారణాలు చూస్తే వారికి ఎంత అలిగినా ఏమి చేసినా టీడీపీ తప్పవేరే ఆప్షన్ లేకుండా పోవడమే అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో చూసుకుంటే మాజీ మంత్రులు గుండా అప్పల సూర్యనారాయణ ఫ్యామిలీని పక్కన పెట్టేశారు. వారు టీడీపీకి విధేయులు తప్ప ఎక్కడికీ పోరు. ఏ పార్టీలోనూ కనిపించరు. అదే విధంగా చూస్తే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎంత అలిగినా ఆయన సైకిల్ దిగే సీన్ లేదని అంటున్నారు. విశాఖలో చూసుకుంటే కనుక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇచ్చామని చెబుతూ చీపురుపల్లి దోవ చూపించారు.
ఆయన నో అన్నా టీడీపీ బేఫికర్ గా ఉంది అని అంటున్నారు. ఆయన ఇద్దరు వియ్యంకులూ టీడీపీ జనసేనలలో కీలకంగా ఉన్నారు. వారిని దాటి ఆయన ఎక్కడికీ వెళ్లలేరని అంటున్నారు. పైగా వైసీపీ వైపు అసలు వెళ్లే చాన్స్ లేదని అంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి ఇదే.
ఆయన వియ్యంకుడు అచ్చెన్నాయుడు, అల్లుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీలో కీలకంగా ఉన్నారు. దాంతో ఆయన ఆ బంధానికి కట్టుబడి ఉంటారని అంటున్నారు. గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజా వైసీపీలోకి అసలు వెళ్లే ప్రసక్తి లేదు. ఆయన ఆవేశం ప్రదర్శించినా తరువాత కూల్ అయ్యే సీన్ ఉంటుందని అంటున్నారు.
ఇక క్రిష్ణా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఇదే విధంగా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే అంటున్నారు. ఆయనకు వైసీపీలో వెళ్లే పరిస్థితి లేదు. ఇలా చాలా చాకచక్యంగానే బాబు సీనియర్ల పరిధిలు పరిమితులు తెలుసుకునే వారిని కట్టడి చేశారు అని అంటున్నారు.
ఇక ఈ పరిణామాలతో సీనియర్లు రగిలిపోతున్నారు. తీవ్ర నిర్ణయాలు అంటున్నారు. అయితే బాబు వారికి ఎపుడూ అందుబాటులోనే ఉంటారు. వారిని ఎలా బుజ్జగించి దారికి తేవాలో ఆయనకు తెలుసు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే సీనియర్లు అందరూ కాకపోయినా కొందరికి మాత్రం బాబు కీలెరిగి వాత పెట్టారని అంటున్నారు. ఈ దెబ్బతో మిగిలిన వారు కూడా సర్దుకుంటారని అందుకే బాబు ఈ విధంగా ఒక సందేశం పంపించారు అని అంటున్నారు. చూడాలి మరి సీనియర్ల ఆగ్రహం ఎలా చల్లారుతుందో.