Begin typing your search above and press return to search.

క‌న్నా, కోట్ల‌, కాల్వ‌, క‌ళా.. ప‌క్క‌న పెట్ట‌డానికి రీజ‌నేంటి?

టీడీపీలో చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు. వారంతా చంద్ర‌బాబు ప‌రివారంగానే ముద్ర వేసుకున్నారు

By:  Tupaki Desk   |   17 Jun 2024 6:31 AM GMT
క‌న్నా, కోట్ల‌, కాల్వ‌, క‌ళా.. ప‌క్క‌న పెట్ట‌డానికి రీజ‌నేంటి?
X

టీడీపీలో చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు. వారంతా చంద్ర‌బాబు ప‌రివారంగానే ముద్ర వేసుకున్నారు. బాబు అధికారంలో ఉంటే.. వారు మంత్రులు ఖాయం! అనే మాట‌ను కూడా ద‌క్కించుకున్నారు. ఇలాంటి వారిలో క‌ళా వెంక‌ట్రావు, కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. ఇక‌, చంద్ర‌బాబు ఏరికోరి పార్టీలో చేర్చుకున్న మ‌రో ఇద్ద‌రు కూడా.. చంద్ర‌బాబు అంటే ప్రాణం పెడతారు. వారిని కూడా..చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు. వారిలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఉన్నారు.

వీరంతా కూడా.. మంత్రి వ‌ర్గంపై ఆశ‌లు పెట్టుకున్న‌వారే. చంద్ర‌బాబు వ‌స్తే.. త‌మ‌కు ప‌ద‌వులు ఖాయ‌మ‌ని రాసిపెట్టుకున్న‌వారే. కానీ, చంద్ర‌బాబు వారి ఆశ‌లు నెర‌వేర్చ‌లేదు. క‌నీసం.. ప‌రిగ‌ణ‌న‌లోకి కూడా తీసుకో లేదు., మ‌రి ఏం జ‌రిగింది? ఇద్ద‌రునాయ‌కులు అంటే పొరుగు పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చారు అనుకున్నా.. మ‌రో ఇద్ద‌రు నాయ‌కులు పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్నారు. మ‌రి వారికి ఏమైంది? ఎందుకు చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌: ఈయ‌న తొలుత కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవ‌త్స‌రాల పాటు ఉన్నారు. త‌ర్వాత‌.. బీజేపీలోకి వెళ్లారు. ఈ స‌మ‌యంలోనే చంద్ర‌బాబు ఆహ్వానించారు.కానీ, ఆయ‌న రాలేదు. పైగా బీజేపీ అధ్య‌క్షుడిగా రాష్ట్రంలో సేవ‌లు అందించారు. త‌ర్వాత‌.. గ‌త ఏడాది మాత్ర‌మే.. టీడీపీ తీర్తం పుచ్చుకున్నారు. ఈ నేప‌థ్యానికి తోడు మంత్రి వ‌ర్గంలో కాపులు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు.

కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి: ఈయ‌న కూడా తొలినాళ్ల‌లో మూడు ద‌శాబ్దాలు కాంగ్రెస్‌లో ఉన్నారు. త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీటికెట్‌పై పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. త‌ర్వాత‌.. పార్టిని ప‌ట్టించుకోలేదు. అస‌లు తాను పోటీలో ఉంటానో లేదో.. అన్న సందేహాలు కూడా వ్య‌క్తం చేశారు. చివ‌రి నిముషంలో టికెట్ ద‌క్కించుకున్నారు. దీంతో ఈయ‌న‌కు కూడా.. చంద్ర‌బాబు ఇవ్వ‌లేదు.

ఇక‌, కాల్వ శ్రీనివాసులు మాత్రం పార్టీకి వీర విధేయుడే. అయినా.. ఆయ‌న‌కు మంత్రి వ‌ర్గంలో చోటు రాలేదు. దీనికి కార‌ణం.. ఈయ‌న బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఈయ‌న సొంత జిల్లా అనంత‌పురంలో కుర‌బ‌లు పెర‌గ‌డంతో వారికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఈయ‌న కోల్పోయారు.

అదేవిధంగా క‌ళా వెంక‌ట్రావు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాష్ట్ర పార్టీ చీఫ్‌గా కూడా ప‌నిచేశారు. అయితే.. ఉమ్మ‌డి శ్రీకాకుళంలో నెల‌కొన్న వ‌ర్గ పోరు కార‌ణంగా ఈయ‌న‌కు కూడా.. చంద్ర‌బాబు ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇదీ.. సంగ‌తి.