1984, 1994, 2014, 2024 వైరల్ పోస్టులో లాజిక్ మిస్!
మీడియా ఏలుబడిలో సమాచారం ఒకలా జర్నీ చేస్తే.. సోషల్ మీడియా ఏలుబడిలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది
By: Tupaki Desk | 2 Jun 2024 4:24 AM GMTమీడియా ఏలుబడిలో సమాచారం ఒకలా జర్నీ చేస్తే.. సోషల్ మీడియా ఏలుబడిలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. నిజాన్ని నిజంగా చెప్పడం కంటే.. అబద్ధాన్ని నిజం కలర్ వేసి అందరూ నమ్మేలా చేయటంపైనే అందరి ఫోకస్ పెరిగింది. దీంతో.. వాస్తవం వార్తల్లో కనిపించటం తగ్గిపోయింది. ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా చోటు చేసుకున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది? మరే పార్టీ ఓడుతుందన్నది మరో మూడు రోజుల్లో తేలిపోయే పరిస్థితి.
ఈ మూడు రోజుల్లో ప్రజల మైండ్ సెట్ ను ప్రభావితం చేయటం ద్వారా కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. అయినప్పటికీ ఎవరికి వారు తమ శక్తి వంచన లేకుండా ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన సమాచారాన్ని తాము అనుకున్న రీతిలో వెల్లడించి.. అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. దీనికి మించి సోషల్ మీడియాలో పోస్టు మరీ సిత్రంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన ఒకట్రెండు గంటలకు ఒక పోస్టు విపరీతంగా వైరల్ గా మారింది.
దాని సారాంశం ఏమంటే.. 1984, 1994,చ 2014, 2024 టీడీపీ గెలుపు అంటూ.. చూసినంతనే నిజమే కదా? అని నమ్మించేలా పోస్టు పెట్టారు. ఎల్లో కలర్ టెంప్లెట్ మీద తెలుగులో ఉన్న ఈ పోస్టు ఎంతోమందిని ఆనందానికి గురి చేసింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చేసిన ఫీల్ తెప్పించేసింది. ఇంతలా తెలుగు తమ్ముళ్ల మదిని దోచిన ఈ పోస్టులో ఒక పెద్ద లోటు ఉంది. అదేమంటే.. ఈ పోస్టులో 2004ను ప్రస్తావించలేదు. చివరి సంఖ్య ‘4’ ఉన్న ప్రతిసారీ అధికారం తెలుగుదేశం పార్టీదన్న రీతిలో తయారు చేసిన ఈ పోస్టులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని కన్వినియంట్ గా మర్చిపోయిన వైనం చూసినప్పుడు.. ఏం తెలివిరా బాబు అనుకోకుండా ఉండలేం. మొత్తంగా చెప్పేదేమంటే.. కాస్తంత లోతుగా ఆలోచించకుండా.. అంకెల్ని తమ వాదనకు వీలుగా చూపించే ధోరణికి ఈ వైరల్ పోస్టుకు నిదర్శనంగా చెప్పాలి. తరచి చూస్తే.. ఇలాంటివెన్నో కనిపిస్తున్నాయి. ఇలాంటి పోస్టులు నిజంలా అనిపించే అర్థసత్యాలుగా చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో ఈ తరహా సిత్రాలు మరెన్ని జనాల మనసుల్ని మాయ చేస్తాయని చెప్పక తప్పదు.