Begin typing your search above and press return to search.

సిక్కోలులో సైకిల్ కి బ్రేకులు వేస్తున్నదెవరు...?

శ్రీకాకుళం జిల్లాలో కచ్చితంగా గెలిచే సీట్లలో ఈ వర్గ పోరు తారస్థాయిలో ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2023 4:45 AM GMT
సిక్కోలులో సైకిల్ కి బ్రేకులు వేస్తున్నదెవరు...?
X

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఒక్క 2019లో తప్ప ఎపుడూ కూడా మంచి సంఖ్య లో సీట్లను గెలుచుకుంటూ వస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లు ఉంటే 2014లో ఏడు సీట్లు గెలుచుకున్న టీడీపీ 2019 నాటికి రెండుకు దిగజారిపోయింది. 2024 ఎన్నికలకు పార్టీ సిద్ధం అవుతోంది. రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది.

ఈసారి అన్నీ అనుకూలిస్తే మెజారిటీ సీట్లు కచ్చితంగా గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే పార్టీలో వర్గ పోరు తీవ్ర స్థాయి లో ఉంది. ఎన్నికల వేళ ఇది పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారుతోంది. అదే సమయం లో పార్టీలో సీనియర్లు బాధ్యత గల స్థానాల లో ఉన్న వారే వర్గ పోరుకు ఊతం ఇస్తున్నారు అని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కచ్చితంగా గెలిచే సీట్లలో ఈ వర్గ పోరు తారస్థాయిలో ఉంది అని అంటున్నారు. శ్రీకాకుళం సీటు లో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే లక్షీ దేవి దంపతులకు పట్టు ఉంది. ఈసారి వారికి టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుచుకుని వస్తారని అంటున్నారు. అయితే అక్కడ మరో నేత ను పార్టీలో కొందరు ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు.

శ్రీకాకుళం లో బలమైన సామాజికవర్గానికి చెందిన గోండు శంకర్ ఈసారి టికెట్ తనకు కావాల ని పట్టుబడుతున్నారు. దీంతో ఈ సీటు లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు ప్రశ్నార్ధకం అయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు. పాతపట్నం సీటు తీసుకుంటే ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్సెస్ మామిడి గోవిందరావు అన్నట్లుగా పరిస్థితి ఉంది.

ఇటీవలనే తన అనుచరులతో కలసి జన్మదిన వేడుకల ను జరుపుకున్న గోవిందరావుకు అగ్ర నేతల ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరు మధ్యన పోరు ఇపుడు రంజుగా ఉంది. ఇది వైసీపీకే మేలు చేస్తుంది అని అంటున్నారు. అదే విధంగా రాజాం సీటు లో మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావుకు ఒక సీనియర్ నేత మద్దతుగా ఉంటే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు మరో సీనియర్ నేత మద్దతు ఉంది అంటున్నారు ఈ ఇద్దరు నేతలూ తమకే టికెట్ అని ధీమాగా ఉంటున్నారు. పోటా పోటీ గా ఉన్నారు.

మరో కీలకమైన సీటు ఎచ్చెర్ల. ఇక్కడ సీనియర్ నేత కళా వెంకటరావు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆయనకు దెబ్బేయడానికి అన్నట్లుగా మరో నేతను ప్రోత్సహిస్తున్నారు అని కళా వర్గం ఆరోపిస్తోంది. కలిశెట్టి అప్పలనాయుడు ఈ సీటు కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు మహానాడు రాజమండ్రీలో నిర్వహిస్తే ఆయనకు సత్కారం కూడా చేశారు. దాంతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత కలిశెట్టికి మద్దతుగా ఉన్నారని అంటున్నారు.

ఇలా కీలక స్థానాల లో వర్గ పోరు ఫలితంగా టీడీపీ కి సిక్కోలు ఈసారి కూడా చుక్కెదురు అవుతుందా అన్నదే చర్చగా ఉంది. మరి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ వివాదాల ను పరిష్కరించి రిపేర్లు చేసే నాధుడు ఉన్నారా అన్నదే చర్చగా ఉంది మరి.