Begin typing your search above and press return to search.

ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాలు ఇవేనా...?

ఒక ఎన్నికకే టీడీపీ కుదేల్ అయిన పార్టీ కాదు కాబట్టి బలాబలాలు చూస్తే ఎక్కడ పసుపు పార్టీకి అనుకూలత ఉంది అన్నది ఆసక్తికరమైన చర్చగానే ఉంది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 1:30 PM GMT
ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాలు ఇవేనా...?
X

ఏపీలో టీడీపీది నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయం. ఆ పార్టీ అనేక ఎన్నికలను చూసింది. దాంతో పాటు ఎన్నో సార్లు గెలిచి ఉంది. బూత్ లెవెల్ నుంచి ఆ పార్టీకి క్యాడర్ ఉంది. అలా టీడీపీ ఓటర్లుగా ఆ పార్టీ గుర్తుకు కట్టుబడిన వారూ చాలా మందే ఉంటారు. ఈ నేపధ్యంలో టీడీపీకి ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో బలమైన జిల్లాలు ఏవి అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.

కాలం ఎపుడూ ఒకేలా ఉండదు, కాంగ్రెస్ కి ఉమ్మడి ఏపీ కంచుకోట. కానీ ఈ రోజు ఏపీలో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతూ ఉనికి కోసం పోరాటం చేస్తోంది. ఇక 2019 లో ఓడిన టీడీపీకి 2024 ఎన్నికలు కీలకం. ఒక ఎన్నికకే టీడీపీ కుదేల్ అయిన పార్టీ కాదు కాబట్టి బలాబలాలు చూస్తే ఎక్కడ పసుపు పార్టీకి అనుకూలత ఉంది అన్నది ఆసక్తికరమైన చర్చగానే ఉంది.

ముందుగా రాయలసీమ రీజియన్ ని తీసుకుంటే ఉమ్మడి నాలుగు జిల్లాలలో ఆఖరున ఉన్న అనంతపురం జిల్లా తప్పిస్తే మిగిలిన మూడు జిల్లాలు అంటే కడప, కర్నూల్, చిత్తూరు జిల్లాలలో టీడీపీ వీక్ గా ఉంది అని అంటున్నారు. ఇక నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇక్కడ 70 శాతం బలం వైసీపీకి ఉంటే ముప్పయి శాతం బలం టీడీపీకి ఉంది అంటున్నారు. ప్రకాశం జిల్లాలో చూస్తే అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలకు సరిసమానంగా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో బలం ఉంది అంటున్నారు.

గుంటూరు క్రిష్ణా జిల్లాలలో చూస్తే చిత్రంగా ఉంది. ఇక్కడ గతంలో టీడీపీ బాగానే ఉంది. కానీ మారిన కాల మాన పరిస్థితులలో వైసీపీకి అరవై శాతం బలం ఉంటే టీడీపీకి నలభై శాతం బలం మాత్రమే ఉంది. అంటే వైసీపీ ఈ రెండు జిల్లాలలో పై చేయిగా ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆది నుంచి టీడీపీకి కంచుకోటగానే ఉంది. దాంతో స్ట్రాంగ్ గా ఈ రోజుకీ ఈ జిల్లాలో టీడీపీ ఉంది అని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే ఈ రోజుకీ వైసీపీ బలంగా ఉంది. పొత్తులలో జనసేన కలిస్తే మాత్రం ఈక్వేషన్స్ మారుతాయని అంటున్నారు. ఇలా ఉభయ గోదావరి జిల్లాలలో బలాబలాలు ఉంటే కీలకమైన ఉత్తరాంధ్రాలో సీన్ మరోలా ఉంది అంటున్నారు.

విశాఖలో వైసీపీకి టీడీపీకి సమాన బలాబలాలు ఉన్నాయి. అంటే చెరి యాభై శాతంగా మోహరించి ఉన్నాయన్నమాట. ఇక విజయనగరం జిల్లా తీసుకుంటే ఇక్కడ ఎనభై శాతం వైసీపీ ఉంటే ఇరవై శాతం మాత్రమే టీడీపీ ఉంది అని అంటున్నారు. ఇక్కడ టీడీపీకి సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కరవు అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే టీడీపీకి గట్టి పట్టు ఉంది అని అంటున్నారు. ఇక్కడ టీడీపీకి డెబ్బై శాతం మద్దతు ఉంటే వైసీపీకి ముప్పయి శాతం మద్దతు ఉంది. ఈ జిల్లాలో 2019లో వైసీపీ మెజారిటీ సీట్లు గెలిచినా స్వీప్ మాత్రం చేయలేక పోయింది అంటే దాని అర్ధం టీడీపీ బలంగా ఉండడమే అంటున్నారు.

ఇక ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలను స్థూలంగా ఇలా చూసినపుడు అంచనా కట్టినపుడు వైసీపీదే పై చేయిగా ఉంది అని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు అన్న సానుభూతి వెల్లువలా ఆ పార్టీకి వస్తే తప్ప మరోసారి టీడీపీ ఏపీలో గెలిచే అవకాశాలు అయితే లేవు అనే అంటున్నారు. టీడీపీ విషయం తీసుకుంటే అన్నీ తానే అయి నడిపిస్తున్న చంద్రబాబు తన శక్తియుక్తులతోనే వైసీపీని ఢీ కొంటున్నారు. ఒక విధంగా 2024 ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివే.

చంద్రబాబు లీడర్ షిప్ కి ఆయన రాజకీయానికి వ్యూహాలకు పరీక్షగా నిలిచే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచి జెండా ఎగరేయకపోతే మాత్రం గడ్డు కాలమే అన్నది కఠినమీన విశ్లేషణగానే చూడాలని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏక వ్యక్తి నాయకత్వంలో ఉండడం కూడా మరో మైనస్ పాయింట్ అని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికలు టీడీపీకి పెను సవాల్ గా మారనున్నాయని అంటున్నారు.