ఆ రాయి టీడీపీని భయపెడుతుందా ?
విజయవాడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన రాయి దాడి తెలుగుదేశం పార్టీ వర్గాలలో ఇప్పుడు కలకలం రేపుతున్నది
By: Tupaki Desk | 20 April 2024 4:14 AM GMTవిజయవాడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన రాయి దాడి తెలుగుదేశం పార్టీ వర్గాలలో ఇప్పుడు కలకలం రేపుతున్నది. జగన్ మీద జరిగిన రాయి దాడిని మొదట అందరూ ట్రాష్ అని, తన మీద తను చేసుకున్న దాడి అని కొట్టిపారేశారు. చివరకు నిందితుడు సతీష్ పోలీసుల చేతజిక్కడం, ఈ ఘటన వెనక టీడీపీ బీసీ సెల్ హస్తం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం టీడీపీ శ్రేణులలో వణుకు పుట్టిస్తున్నది. ఇది మరో కోడికత్తి డ్రామా అని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేశారు. కానీ అదే కోడికత్తి గత ఎన్నికలలో ఎంత పనిచేసిందో అందరికీ తెలుసే. అందుకే ఇప్పుడు ఈ రాయి దాడి ఘటన ఎక్కడికి దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొన్నది.
ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమ ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. అయితే బోండా ఉమాకు భధ్రత కల్పించేందుకు విజయవాడ టీడీపీ కార్యాలయానికి పోలీసులు వెళ్లారు. వారు తనను అరెస్టు చేసేందుకే వచ్చారని భావించిన ఉమా అక్కడి నుండి వెళ్లిపోవడం టీడీపీ నేతలకు ఉన్న భయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది అపధర్మ పాలన. వ్యవస్థలు అన్నీ ఈసీ కనుసన్నలలోనే పనిచేస్తాయి. అందుకే జగన్ పై దాడి కేసులు పోలీసులు తీసుకుంటున్న చర్యలు టీడీపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి.
జగన్ పర్యటన నేపథ్యంలో డబ్బులకు ఆశపడి నిందితులు అక్కడికి వెళ్లారని, డబ్బులు తక్కువ ఇవ్వడం మూలంగా ఆగ్రహంతో అలా చేశారని కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. కానీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న అంశాలను బట్టి రాయి దాడి ఖచ్చితమైన పథకం ప్రకారమే జరిగిందని పేర్కొనడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈ దాడి ఆరోపణల నుండి తమకు డ్యామేజీ కాకుండా ఎలా భయటపడాలా ? అన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. జగన్ మీద దాడి ఘటన తర్వాత గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు అన్నీ ఆ రాయి చుట్టే తిరుగుతుండడం గమనార్హం.