ఎలక్షనీరింగ్ లో ఆ పార్టీదే పైచేయి...మరి పవర్ వారిదేనా ?
అసలు బీజేపీని మిత్రుడిగా చేసుకోవడం వెనక టీడీపీ వ్యూహామే ఇదీ అని అంటున్నారు.
By: Tupaki Desk | 27 May 2024 1:30 PM GMTఎన్నికలు అంటేనే సామ దాన భేద దండోపాయాలు ఉండాలి. అక్కడి దాకా వచ్చి యుద్ధ భూమిలో నీతులు చెబితే అసలు కుదిరే పనే కాదు. పరీక్షకు ప్రిపేర్ అయిన విద్యార్ధి బాగా చదవవచ్చు. కానీ తాను చదివినది పరీక్షలో రాస్తేనే కదా మార్కులు రాబట్టేది. అలా జనంలో ఆదరణ ఎంత ఉన్నా దానిని ఓటు వేయించుకోగలిగితేనే గెలుపు పిలుపు వినిపిస్తుంది.
ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ లో ఎవరిది పై చేయి అంటే నెమ్మదిగా వస్తున్న సమాచారం చూసినా అలాగే అధికారంలో ఉంటూ కూడా రీ పోలింగ్ కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతల తీరు చూసినా కూడా టీడీపీదే పై చేయి అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బాగా సక్సెస్ అయింది అని అంటున్నారు.
అసలు బీజేపీని మిత్రుడిగా చేసుకోవడం వెనక టీడీపీ వ్యూహామే ఇదీ అని అంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరోసారి వస్తామన్న నమ్మకంతో ఉంది. దాంతో బీజేపీని కూటమిలోకి ఆహ్వానించడం ద్వారా టీడీపీ చాలా తెలివైన ఎత్తుగడకే పాల్పడింది అని అంటున్నారు.
ఎన్నికల వేళ వ్యవస్థలను దగ్గరకు తీసుకుని పూర్తి సహకారం టీడీపీ పొందిందని దాని ఫలితమే వైసీపీకి గత కొన్ని ఎన్నికల నుంచి కంచుకోటలుగా ఉన్న సీట్లు ఈసారి డౌట్లో పడ్డాయని అంటున్నారు. గురజాల మాచర్ల లలో టీడీపీకి గెలుపు ధీమా పెరిగింది. అంతే కాదు రాయలసీమ జిల్లాలలో కొన్ని కీలకమైన స్థానాల్లో సైతం గెలుపు అవకాశాలు మెరుగుపరచుకుందని చెబుతున్నారు.
ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అయితే జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా కూటమిని సహకరించారు అని తాపీగా అసలు విషయం చెప్పారు. అసలే నెల్లూరులో వైసీపీకి ఎన్నికల ముందు నుంచి రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇపుడు కాకాణి చెబుతున్న మ్యాటర్ వింటే అక్కడ కూడా కూటమి ఎలక్షనీరింగ్ బ్రహ్మాండంగా ఉందనే అంటున్నారు.
మరో వైపు సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన మంత్రి అంబటి రాంబాబు రీపోలింగ్ కొన్ని చోట్ల కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మాచర్ల గురజాలలో సైతం రీ పోలింగ్ పెట్టించండి అని అడుగుతోంది అధికార పార్టీ. సాధారణంగా చూస్తే విపక్షంలో ఉన్న పార్టీలు రీ పోలింగ్ కోరుతాయి. చిత్రంగా అధికారంలో ఉన్న పార్టీ కోరుతోంది అంటే ఎలక్షనీరింగ్ లో ఎవరిది పై చేయి అన్నది తెలిసిపోతోంది అని అంటున్నారు
అంతే కాదు ఏపీలో చాలా నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. తాము గెలిచే సీట్లు ఎటూ ఉన్నాయి. కానీ ఓడే సీట్ల విషయంలో వైసీపీ బలంగా ఉన్న చోటనే గురి పెట్టి మరీ కూటమి అక్కడ తన వ్యూహాలతో వైసీపీ లెక్కలు సరిచేసి పెట్టిందని అంటున్నారు.
ఇవన్నీ కూడుకున్న మీదటనే కూటమి కచ్చితంగా గెలుస్తుందని టీడీపీ ధీమాగా ఉందని అంటున్నారు. ఇక ఒంటరిగా పోరుకు వెళ్ళిన వైసీపీ జనాలనే నమ్ముకుంది. ఆ జనాలను ఓటేసేందుకు అవకాశం ఇవ్వలేదని తిరిగి ఆ పార్టీ అంటోంది. మరి ఇలా వ్యూహాలలోనే తడబాట్లూ తప్పటడుగులూ వేస్తూ గెలుస్తామని ఎలా చెప్పగలదని అంటున్నారు. ఏది ఏమైనా ఈవీఎంలో పడిందే ఓటు. ఆ ఓటు ఎవరికి ఎక్కువగా మళ్ళిందో వారిదే విజయం. మరి జూన్ 4న ఫలితం ఎవరికి అనుకూలం అవుతుందో చూడాల్సి ఉంది అంటున్నారు.