Begin typing your search above and press return to search.

వైసీపీ బిగ్ షాట్స్ మీద టీడీపీ టార్గెట్...?

టీడీపీ వల వేస్తున్న సీనియర్ నేతలు ఎవరు, పార్టీ పట్ల వారి విధేయతలు ఏమైనా మారుతున్నాయా అన్నది కూడా గమనంలోకి తీసుకుంటోంది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:01 AM GMT
వైసీపీ బిగ్ షాట్స్ మీద టీడీపీ టార్గెట్...?
X

ఉత్తరాంధ్రా జిల్లాలు టీడీపీకి కంచుకోటలు. ఆ పార్టీ ఎన్ని ఎన్నికలలో ఓడినా గెలిచినా ఉత్తరాంధ్రా మాత్రం టీడీపీ వెంటనే ఉంది. అంతవరకూ ఎందుకు వైఎస్సార్ ప్రభంజనం వీచిన 2004 ఎన్నికల్లో కూడా సగానికి సగం సీట్లను టీడీపీ గెలుచుకుంది. అలా తన పరువుని ప్రతిష్టను కాపాకుంటూ వచ్చింది.

కానీ ఫస్ట్ టైం 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో కేవలం ఆరు మాత్రమే దక్కాయి. విజయనగరం జిల్లాలో ఒక్క సీటూ రాకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక మొత్తం అయిదు ఎంపీ సీట్లు ఉంటే అందులో నాలుగింటిని వైసీపీ కైవశం చేసుకుంది.

ఆ విధంగా వైసీపీ ఉత్తరాంధ్రాలో పాగా వేసింది. ఈ రోజుకీ వైసీపీ సై అంటే సై అంటోంది. సగానికి సగం బలం చూపిస్తోంది. దాంతో ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లు తెచ్చుకోవాలన్న టీడీపీ ఆరాటానికి బ్రేకులు పడిపోతున్నాయి.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు టీడీపీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే వైసీపీని నిలువరించాలి. అదే విధంగా ఆ పార్టీలో బిగ్ షాట్స్ ని కూడా నియంత్రించాలి. దాంతోనే ఆపరేషన్ వైసీపీని పసుపు పార్టీ చేపట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్రా మీద వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో వైసీపీ రాజకీయ ప్రయోగాలను కూడా ఈసారి ఉత్తరాంధ్రా నుంచే స్టార్ట్ చేయనుంది అని అంటున్నారు.

సీనియర్ నేతలను లోక్ సభకు పంపించి జూనియర్లకు కొత్త ముఖాలకు చాన్స్ ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. ఈ పరిణామం పట్ల వైసీపీలో తెలియని అసంతృప్తి ఉందని అంటున్నారు. సీనియర్లు లోక్ సభకు పోటీకి ససేమిరా అంటున్న పరిస్థితి ఉంది. అదే విధంగా తాము కాకపోతే తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్న వారూ ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో అధినాయకత్వం మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకోవాలని చూస్తోంది.

దీంతో వైసీపీలో కొందరికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. బిగ్ షాట్స్ కే సైకిల్ పార్టీ వల వేస్తోంది అని అంటున్నారు. తమ వైపునకు వస్తే వారికి అన్ని విధాలుగా మేలైన రాజకీయాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నారు అని అంటున్నారు.

దాంతో వైసీపీ కూడా అలెర్ట్ అవుతోంది. టీడీపీ వల వేస్తున్న సీనియర్ నేతలు ఎవరు, పార్టీ పట్ల వారి విధేయతలు ఏమైనా మారుతున్నాయా అన్నది కూడా గమనంలోకి తీసుకుంటోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీకి ఉత్తరాంధ్రాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే పరిస్థితి ఉంది అని అంటున్నారు. విజయసాయిరెడ్డి గతంలో బాధ్యతలు నిర్వహించినపుడు మూడు జిల్లాలు కట్టుగా ఒక పట్టు మీద నడిపేవారు.

ఇపుడు ఆ పరిస్థితి అయితే లేదు. దాంతో పట్టు సడలింది. ఈ క్రమంలో సీనియర్ల మనోభావాలను అధినాయకత్వం కనుక గమనించి పార్టీని సరైన దిశగా నడిపించకపోతే మాత్రం అదను చూసి టీడీపీ దెబ్బేయడం ఖాయమని అంటున్నారు. మరి అదే జరుగుతుందా వైసీపీ అప్రమత్తం అవుతుందా అన్నది వేచి చూడాలి.

ఏది ఏమైనా ఒక్క మాట ఉంది. రాజకీయాల్లో విధేయతలు ప్రతీ అయిదేళ్లకూ మారిపోతూ ఉంటాయి. గాలి ఎటు వైపు వీస్తే అటు సర్దుకుంటారు. అదే సమయంలో తమకు నచ్చని చోట అవకాశం లేని చోట క్షణం కూడా ఉండేందుకు ఏ రాజకీయ నాయకుడూ ఇష్టపడడు అన్నది తెలిసిందే. మొత్తం మీద ఉత్తరాంధ్రాలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం ముందు ముందు భలే రంజుగా సాగుతుందని అంటున్నారు.