ప్రొద్దుటూరులో నాలుగు స్తంభాలాట
ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీలో నాలుగు స్తంభాలట పెరిగిపోతోంది. నలుగురు బలమైన నేతలు టికెట్ కోసం పోటీపోటీ రాజకీయాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 29 Dec 2023 1:30 PM GMTప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీలో నాలుగు స్తంభాలట పెరిగిపోతోంది. నలుగురు బలమైన నేతలు టికెట్ కోసం పోటీపోటీ రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడే లేనంతగా రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం సీనియర్లు ప్రయత్నాలు చేసుకుంటుండటం చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా తయారైంది. నలుగురు నేతల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది ఇపుడు పెద్ద సమస్యగా మారింది. నలుగురు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయేది తామేనంటే కాదు కాదు తామే అని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.
వైసీపీ తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాదరెడ్డికే దాదాపు టికెట్ ఖాయమైంది. అందుకనే రాచమల్లును టీడీపీ తరపున ఎవరు ఢీ కొంటారనే సస్పెన్స్ టీడీపీలో పెరిగిపోతోంది. మాజీ ఎంఎల్ఏలు వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం సురేష్ నాయుడు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళల్లో పోటీలో ఉండేది ఎవరో తెలీక మధ్యలో ద్వితీయశ్రేణినేతలు, క్యాడర్ అయోమయంలో పడిపోతున్నారు. కాంగ్రెస్ తరపున ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచి ఇపుడు టీడీపీలో ఉన్న వరదరాజులరెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. అయితే ఆయనకు వయసైపోయింది.
ఇదే సమయంలో టీడీపీ తరపునే గతంలో గెలిచిన లింగారెడ్డి కూడా పోటీకి రెడీ అవుతున్నారు. అయితే లింగారెడ్డికి వరదరాజులరెడ్డికి ఏమాత్రం పడదు. లింగారెడ్డికి ఉన్న పట్టు కూడా అంతంతమాత్రమే. ఇక ప్రవీణ్ కుమార్ రెడ్డి యువకుడు బాగా యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ బలమే ప్రవీణ్ బలం. ప్రవీణ్ ఇపుడు నియోజకవర్గం ఇన్చార్జి కూడా. అందుకనే పార్టీ కార్యక్రమాలన్నీ ప్రవీణ్ చేతులమీదగానే జరగుతున్నాయి. అయితే ప్రవీణ్ కు పై ఇద్దరు సహకరించటంలేదు.
వీళ్ళ ముగ్గురి మధ్యే టికెట్ రేసుందని అనుకుంటున్న సమయంలో సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు సడెన్ గా తెరపైకి వచ్చారు. సురేష్ కోసం టీడీపీ+బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో తనకున్న సన్నిహితాన్ని రమేష్ ఉపయోగిస్తున్నారు. మొత్తానికి టికెట్ కోసం ప్రొద్దుటూరులో ఓ రేంజిలో రేసు నడుస్తోంది. అందుకనే టికెట్ ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి పెరిగిపోతోంది.