ఇండియా కూటమి వైపుగా టీడీపీ...?
తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల పైగా చరిత్ర. ఇందిరా గాంధీ నుంచి ఈ రోజు వరకూ ఎన్నో చూస్తూ వస్తోంది.
By: Tupaki Desk | 16 Sep 2023 8:25 AM GMTతెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల పైగా చరిత్ర. ఇందిరా గాంధీ నుంచి ఈ రోజు వరకూ ఎన్నో చూస్తూ వస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో చెన్నారెడ్డి నుంచి జలగం వెంగళరావు శకం నుంచి ఇప్పటితరం వరకూ మరెందరితొనో రాజకీయ పోరాటాలూ చేసింది. బీజేపీలో అయితే వాజ్ పేయ్ అద్వానీ ద్వయం నుంచి మోడీ అమిత్ షా వరకూ చంద్రబాబు చూశారు.
ప్రస్తుతం టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చంద్రబాబు అనూహ్యంగా జైలు పాలు అయ్యారు. ఆయన అరెస్ట్ అయి శనివారానికి ఎనిమిది రోజులు. బాబు అరెస్ట్ అయినా బెయిల్ మీద క్షణాలలో వస్తారు అని అంతా అనుకున్న నేపధ్యం ఉంది. కానీ ఆయన ఇన్ని రోజులు జైలు గోడల మధ్య ఉండడం అంటే టీడీపీ తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు.
ఈ అరెస్ట్ వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ కూడా మొదలైంది. కేంద్ర పెద్దల అండ చూసుకునే ఏపీ ప్రభుత్వం బాబుని జైలులో పెట్టింది అన్నది మెల్లగా ప్రచారంగా మారి ఇపుడు టీడీపీ లోనే అనుమానాల మేఘాలకు కారణం అవుతోంది. టీడీపీ పెట్టిన నాటి నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే కేంద్రం పాత్ర ఉందా అన్నట్లుగా ఘాటైన ఆరోపణలే చేశారు.
ఇంకో వైపు చూస్తూంటే చంద్రబాబు అరెస్ట్ తరువాత వరసగా ఇండియా కూటమి నేతల నుంచే ఫోన్లు లోకేష్ కి వస్తున్నాయి. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి వారు బాబు అరెస్ట్ తప్పు అని ఖండిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కి చెందిన ఏపీ నేత కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సైతం కేంద్రమే ఈ ఆరెస్ట్ చేయించిందని నిందించారు.
ఈ పరిణామాల క్రమంలో ఇండియా కూటమి వైపుగా టీడీపీ సాగుతోంది అని ప్రచారం సాగుతోంది. దానికి బలాన్ని ఇచ్చేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు లోకేష్ కి వస్తున్న ఫోన్లు కానీ ఇస్తున్న మద్దతు కానీ అంతా ఇండియా కూటమి నుంచే అని పేర్కొన్నారు.
ఈ పరిణామం చూస్తూంటే ఇండియా కూటమిలో టీడీపీ భాగస్వామి అని నిర్దారణ అవుతోందని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఇండియా కూటమి సభ్యులు అందరి ఆలోచన ఒక్కటేనని అవినీతి చేయడం దోచుకోవడమే అని ఆయన అంటున్నారు. ఒక విధంగా బాబుని ఆయన పార్టీని ఇండియా కూటమి వారు ఆహ్వానిస్తున్నారని అర్ధం అవుతోంది.
అదే టైం లో ఎన్డీయే దీని మీద అసలు రియాక్ట్ కావడం లేదు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కుమారుడు లోకేష్ కి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం రాలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగారని ప్రచారం సాగినా అది ఏమీ సాగినట్లుగా కనిపించడంలేదు. ఇక అమిత్ షా హైదరాబాద్ కి ప్రయాణం అయ్యారు. ఆయన రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల హడావుడి ఉంటుంది. దాంతో ఇండియా కూటమి నుంచే టీడీపీకి ఆకర్షణ మంత్రం పనిచేస్తోంది అని అంటున్నారు
మరో వైపు టీడీపీకి మద్దతుగా నిలిచే తెలుగు మీడియా సైతం ఇండియా కూటమి వైపున ఉంటేనే మేలు అన్నట్లుగా సూచనలు ఇస్తోంది అంటున్నారు. ఇక ఢిల్లీలో కూడా ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉండే జాతీయ మీడియా హౌజ్ లే లోకేష్ తో టచ్ లో ఉంటున్నాయి. ఇంటర్వ్యూలు ఇస్తున్నాయని కూడా అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తొందరపడరని అంటున్నారు. మరోసారి కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఈ రోజుకీ ఒక భావన ఉంది. అందువల్ల చంద్రబాబు 2019 మాదిరిగా త్వరపడి డెసిషన్ తీసుకోరు అనే అంటున్నారు. అయితే బీజేపీ మీద మాత్రం టీడీపీ నేతలు లోలోపల కుతకుతలాడుతున్నారు.
ఇక కామ్రేడ్స్ అయితే బీజేపీ లేని కూటమి ఏపీలో రావాలని అందులో తాము ఉండాలని చూస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీలో రాజకీయం మలుపు తిరగాలీ అంటే అది బాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాతనే అంటున్నారు. ఒకవేళ బీజేపీ మీద టీడీపీ పెద్దలకు గుస్సా ఉన్నా సరైన టైం లోనే కీలక నిర్ణయం తీసుకుంటారు తప్ప ఈ క్లిష్ట పరిస్థితుల్లో కానే కాదని అంటున్నారు. సో అంతవరకూ వెయిట్ చేయాల్సిందే.