Begin typing your search above and press return to search.

గుంటూరు మీదా గురిపెట్టారు !

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:32 AM GMT
గుంటూరు మీదా గురిపెట్టారు !
X

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో వచ్చీ రావడంతోనే విశాఖపట్నం కార్పోరేషన్ పీఠం మీద టీడీపీ కన్నేసింది. అక్కడ మొత్తం 98 కార్పోరేటర్లకు గాను వైసీపీకి 59, టీడీపీకి 31, జనసేనకు ఐదుగురు, బీజేపీ, సీపీఐ, సీపీఎంలకు ఒక్కరు చొప్పున ఉన్నారు. ఇక్కడ కూటమి 37, సీపీఎం, సీపీఐలతో కలిపి 39 మంది ఉన్నారు. వైసీపీ నుండి 15 మంది పార్టీని వీడటానికి సిద్దంగా ఉండడంతో 54 మందితో విశాఖ కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఎగరేయడానికి రంగం సిద్దం అవుతుంది.

అలాగే గుంటూరు కార్పోరేషన్ మీద కూడా పచ్చజెండా ఎగిరేసేందుకు పావులు కదులుతున్నాయి. లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 58 మంది కార్పోరేటర్లలో వైసీపీకి 47, టీడీపీకి 9, జనసేనకు ఇద్దరు కార్పోరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో మేయర్ పదవితో పాటు, రెండు డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ గెలుచుకుంది.

గుంటూరు మేయర్‌గా వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు మీద సొంత పార్టీలోనే అసమ్మతి ఉంది. ఇటీవల చిలుకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి పత్తిపాటి పుల్లారావు చేతిలో 33262 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కావటిపై సొంతపార్టీలోనే అసంతృప్తి ఉంది. ఎన్నికలకు ముందే ఎనిమిదిమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా వీరిలో డిప్యూటీ మేయర్ సజీలా కూడా ఉంది. ప్రస్తుతం జనసేనతో కలుపుకొని కార్పొరేషన్‌లో టీడీపీ బలం పందొమ్మిదికి చేరింది. మరో పదిమంది కార్పొరేటర్ల మద్దతు సాధిస్తే టీడీపీకే మేయర్ పీఠం ఖాయం.

మేయర్‌పై తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు మొదటి నుండీ అసంతృప్తిగానే ఉన్నారు. మేయర్‌కి, మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి ఏమాత్రం పడటం లేదు. దీంతో ముస్తఫా అనుచరులైన కార్పొరేటర్లు కావటికి మద్దతిచ్చే అవకాశం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దగా ఇబ్బంది లేకుండానే టీడీపీ పీఠం చేజిక్కించుకునే అవకాశం ఉంది. టీడీపీ నేత కోవెలమూడి నాని మేయర్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తుంది. రాబోయే కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాసానికి రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.