అక్కడ టీడీపీ గెలిస్తే అధికారంలోకి రానట్టేనా?
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 2004, 2009ల్లో ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. ఈ రెండుసార్లు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు.
By: Tupaki Desk | 20 May 2024 7:02 AM GMTసవాళ్లు, ప్రతి సవాళ్లతో యుద్ధ వాతావరణంతో హీటెక్కిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న ముగిశాయి. ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యే వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ఎవరు గెలుస్తారనేదానిపై భారీ ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి.
ఒకవైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ అయితే ఒక అడుగు ముందుకేసి గతంలో కంటే తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ఢంకా బజాయించి చెప్పారు. అంతేకాకుండా జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని తేదీని కూడా వైసీపీ అధికారికంగా ప్రకటించేసింది.
ఏపీ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడంతో అది ఎవరికి మేలు చేస్తుందనే దానిపై అనేక చర్చలు సాగుతున్నాయి. కాగా ఇదే క్రమంలో రాజకీయపరమైన ‘సెంటిమెంట్లు’ కూడా తెరపైకి వస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదని గుర్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 2004, 2009ల్లో ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. ఈ రెండుసార్లు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే 2014లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఓటమి పాలయ్యారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
ఇక 2019 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ టీడీపీ తరఫున నాలుగోసారి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ తరఫున విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది.
ఇప్పుడు మరోసారి టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్, వైసీపీ తరఫున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా.. గెలిచిన వారి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంటు కొనసాగుతుందో, లేదో అనేది ఆసక్తికరంగా మారింది.
2004, 2009 ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి ఉరవకొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆయన ఆ రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో పయ్యావుల కేశవ్ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో పయ్యావుల గెలిచారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. మరి ఈసారి ఈ ఆనవాయితీ కొనసాగుతుందో లేక బ్రేక్ అవుతుందో వేచిచూడాల్సిందే.