వైసీపీ వర్సెస్ టీడీపీ : రాయలసీమ కొరుకుడు పడడంలేదా...?
సీమ కు సంబంధించి చూస్తే బాబు జగన్ ఇద్దరూ ఒక్కటే అన్న భావన లో సీమవాసులు ఉన్నారని కూడా ఒక అభిప్రాయం ఉంది.
By: Tupaki Desk | 27 July 2023 1:44 PM GMTరాయలసీమ ప్రాంతం ఉమ్మడి మద్రాస్ లో ఉన్నపుడు అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. మద్రాస్ స్టేట్ లో ముఖ్య భూమిక ను ఆ ప్రాంత వాసులు పోషించారు. సాగు తాగు నీటికి కటకటలాడకుండా తుంగభద్ర మొత్తం సీమ లోనే ఉండేది. బళ్ళరి ప్రాంతం అంతా సీమ లో కలసి ఉండేది అయితే ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర విభజన సీమ కు శాపంగా మారితే ఆ తరువాత కాలం లో ఉమ్మడి ఏపీ విభజన పూర్తిగా సీమ ను ఇబ్బందుల పాలు చేసి పారేసింది.
ఈ రోజుకూ సీమ కు తాగు సాగు నీటి విషయం లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. వరసగా రెండు ప్రభుత్వాలు ఏపీ లో అధికారం లోకి వచ్చాయి. చంద్రబాబు అయిదేళ్ళు జగన్ మరో అయిదేళ్ళు అన్నట్లుగా ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ పరిణామాల నేపధ్యంలో రాయలసీమ ప్రజలు తమ కు కష్టాలు ఇంకా తీరడంలేదని అంటున్నారు.
ఇక 2014లో చూస్తే టీడీపీకి అనంతపురం లో మెజారిటీ సీట్లు దక్కాయి. కడప లో ఒకటి, కర్నూల్ లో కొన్ని సీట్లు చిత్తూరులో కొన్ని సీట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ సీట్లు దక్కాయి. ఇక 2019 వచ్చేనాటికి టీడీపీకి మూడు సీట్లు దక్కితే వైసీపీ కి 49 సీట్లు దక్కాయి.
సీమ ప్రాజెక్టుల కు మోక్షం లభిస్తుంది అని అంతా భావించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏలుబడిలోనూ ఏమీ జరగలేదన్న వేదన వారికి ఉంది. సరిగ్గా ఆ పాయింట్ నే పట్టుకుని సీమ లో సాగునీటి ప్రాజెక్టుల విషయం లో వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
రాయలసీమ లోని కరవు పీడిత ప్రాంతాల కు క్రిష్ణా నది నీరుని తరలించడంతో వైఎస్సార్ పాత్ర అమోఘం అంటూ తండ్రిని మెచ్చుకున్న చంద్రబాబు ఆ నోటి తోనే జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రజల ఆశల ను ఆకాంక్షల ను జగన్ నీరు కార్చారని మండిపడ్డారు.
ఏకంగా జగన్ని రాయలసీమ ద్రోహి అంటూ అతి పెద్ద మాటనే వాడారు. అయితే చంద్రబాబు విమర్శల ప్రభావం సీఎం జనాల మీద ఎంత వరకూ ఉంటుంది అన్నది చర్చకు వస్తోంది. సీమ కు సంబంధించి చూస్తే బాబు జగన్ ఇద్దరూ ఒక్కటే అన్న భావన లో సీమవాసులు ఉన్నారని కూడా ఒక అభిప్రాయం ఉంది.
అయితే చంద్రబాబు సీమ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. వైసీపీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాల ను తమ వైపు తిప్పుకుంటే మరే పార్టీతో పొత్తులతో అవకాశం లేకుండా అధికారం మొత్తం దఖలు పదుతుంది అన్నది బాబు మార్క్ వ్యూహం. ఇక వైసీపీ బాబు విమర్శల ను పెద్దగా తిప్పికొట్టలేకపోతోంది. ఎంతో మంది కీలక నేతలు సీమ లో ఉన్నా వారు ఎందుకో సైలెంట్ గా ఉన్నారు.
పదవులు దక్కించుకున్న వారు కూడా ఇందులో ఉన్నారు. వారంతా నోరు మెదపకపోవడం వల్ల వైసీపీ కి రాజకీయంగా భారీ నష్టం జరుగుతుందా అన్న చర్చ ఒక వైపు ఉంది. మరో వైపు ఎవరు అధికారంలోకి వచ్చినా తనకు ఏముంది అన్న నిర్వేదంలో సీమ జనాలు ఉంటే మాత్రం అది రెండు పార్టీలకూ ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ టీడీపీల కు సీమ ఈసారి కొరుకుడు పడుతుందా అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది.