Begin typing your search above and press return to search.

భ‌ర‌త్ వ‌ర్సెస్ వాసు.. వేడెక్కిన రాజ‌మండ్రి పాలిటిక్స్‌

రాజ‌మండ్రి రాజ‌కీయాలు వేడెక్కాయి. మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు, రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు మ‌ధ్య రాజ‌కీయం జోరుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   6 July 2024 12:30 PM GMT
భ‌ర‌త్ వ‌ర్సెస్ వాసు.. వేడెక్కిన రాజ‌మండ్రి పాలిటిక్స్‌
X

రాజ‌మండ్రి రాజ‌కీయాలు వేడెక్కాయి. మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు, రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు మ‌ధ్య రాజ‌కీయం జోరుగా సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసు కుంటున్నారు. ఒకరిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేసుకునే రేంజ్‌కు రాజ‌కీయం చేరిపోయింది. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయంపై స‌ర్వ‌త్ర ఆస‌క్తి నెల‌కొంది.

ఏం జ‌రిగింది?

ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా.. ఆదిరెడ్డి వ‌ర్సెస్ అప్ప‌టి ఎంపీ భ‌ర‌త్‌కు మ‌ధ్య రాజ‌కీయ వివాదం ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. మాజీ ఎంపీ భ‌ర‌త్ కు చెందిన ప్ర‌చార ర‌థం మంట‌ల్లో కాలిపోయింది. అది కూడా.. ఆయ‌న కార్యాల‌యంలోనే కాలిపోవ‌డంతో ఇది రాజ‌కీయంగా దుమారం రేపింది. ఈ మంట‌ల వెనుక‌.. ఆదిరెడ్డి వాసు ప్లాన్ ఉంద‌ని భ‌ర‌త్ ఆరోపించారు. త‌న‌పై ఉన్న రాజ‌కీయ వైరం కార‌ణంగానే.. త‌న ప్ర‌చార రథాన్ని తగుల బెట్టించార‌ని విమ‌ర్శించారు.

దీనిపై పోలీసు కేసు కూడా న‌మోదైంది. అనంత‌రం.. భ‌ర‌త్ అనుచ‌రుడు ఒక‌రు ఉద్దేశ పూర్వ‌కంగా.. భ‌ర‌త్‌కు సానుభూతి పెర‌గాల‌న్న ఉద్దేశంతోనే ప్ర‌చార వాహ‌నానికి స్వ‌యంగా నిప్పు పెట్టార‌ని పోలీసులు గుర్తించారు. దీనిపై నివేదిక కూడా సిద్ధం చేశారు. కానీ, భ‌ర‌త్ మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఆదిరెడ్డి వాసు ఉద్దేశ పూర్వ‌కంగా దీనిని చేశార‌ని.. అవ‌స‌రమైతే.. స్థానిక మార్కండేయ స్వామి ఆల‌యంలో తాను ప్ర‌మాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని మాజీ ఎంపీ సవాల్ రువ్వారు.

ఈ వ్య‌వ‌హారంపై తాజాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి స్పందిస్తూ.. రాజ‌కీయ వివాదాల్లోకి అన‌వ‌స‌రంగా దేవుళ్ల‌ను లాగుతున్నార‌ని.. ఇదేం ప‌ద్ధ‌త‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లను మించిన దేవుళ్లు ఎవ‌రూ లేర‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్యే తేల్చుకుందామ‌ని వ్యాఖ్యానించారు. తాను ఏ దేవుడిపైనా ప్ర‌మాణం చేయ‌బోన‌ని చెప్పారు. దీనికి కౌంట ర్‌గా భ‌ర‌త్.. త‌ప్పు చేసిన వాళ్లే భ‌య‌ప‌డ‌తార‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో రాజ‌మండ్రి రాజ‌కీయాలు ఏ క్ష‌ణంలో ఎలాంటి ర‌గ‌డ‌కు దారితీస్తాయోన‌న్న భ‌యం వెంటాడుతోంది.