మచిలీపట్నంలో బ్యానర్ల రగడ.. టీడీపీ వర్సెస్ వైసీపీ
తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య బ్యానర్ల రగడ తెరమీదికి వచ్చింది.
By: Tupaki Desk | 10 March 2024 9:00 AM GMTసార్వత్రిక ఎన్నికలకు ముందే.. ప్రధాన పార్టీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ రగడ ప్రారంభమైంది. తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య బ్యానర్ల రగడ తెరమీదికి వచ్చింది. ఒకరి బ్యానర్లను మరొకరు తెంపేయడం.. తగలబెట్టడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. మాజీమంత్రి పేర్ని నాని కుమారుడు, మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు కొందరు వీరంగం సృష్టించారు. టీడీపీ కార్యకర్త ఇంటిపైకి కిట్టు అనుచరులు దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఉల్లిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈడే యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న యశ్వంత్ను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. తమ గ్రామంలో టీడీపీ బ్యానర్లు కడుతున్నాడని కక్ష పెట్టుకుని 20 మంది వైసీపీ నేతలు ముఖ్యంగా కిట్టు అనుచరులు దాడి చేశారని యశ్వంత్ బంధువులు ఆరోపించారు. ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి, కారులో ఎక్కించు కుని బయటకు తీసుకుని వెళ్లారని, తీవ్రంగా కొట్టారని బాధితుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.
ఘటన విషయం తెలిసిన వెంటనే టీడీపీ మాజీ మంత్రి, మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త యశ్వంత్ను పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దాడి చేసిన వారిలో పేర్ని కిట్టు అనుచరులు పత్తి పవన్, హేమ నాని, చరణ్, పత్తి రామారావు ఇలా మొత్తం 20 మంది వరకు ఉన్నారని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పారు. పేర్ని కిట్టు, అతని అనుచరులపై బాధిత యశ్వంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇలాంటి ఘటనలను సహించేది లేదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.