ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందేనా ?
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించాలని కాంగ్రెస్ అనుకుంటున్నది. అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు మొదలుపెట్టింది.
By: Tupaki Desk | 30 Dec 2023 12:30 PM GMTపొత్తుల విషయంలో చంద్రబాబునాయుడుకు క్లారిటీ వచ్చేందుకు ఫిబ్రవరి వరకు వెయిట్ చేయక తప్పదా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు సంక్లిష్టంగా మారుతుండటమే. ఇపుడు జనసేనతో టీడీపీకి పొత్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ కూడా కలిసొస్తే కానీ పొత్తు సంపూర్ణం కాదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాల్సిందే అని గట్టిగా కోరుకుంటున్నారు.
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించాలని కాంగ్రెస్ అనుకుంటున్నది. అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు మొదలుపెట్టింది. వైఎస్ షర్మిలను చేర్చుకుని పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆలోచించటం ఇందులో భాగమే. షర్మిల గనుక పార్టీ పగ్గాలు అందుకుంటే కొంత ఊపు రావచ్చని అనుకుంటున్నారు. పనిలోపనిగా వైసీపీ టికెట్ల విషయంలో అసంతృప్తులు గనుక కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తే హస్తం పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో రెడీమేడ్ గా కొందరు గట్టి అభ్యర్థులు దొరుకుతారని అనుకుంటున్నారు. అప్పుడు జనాలు జనసేన కన్నా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
మొన్న బెంగళూరు ఎయిర్ పోర్టులో సీనియర్ నేత డీకే శివకుమార్ తో చంద్రబాబు మంతనాల విషయం తెలిసిందే. అంతకుముందే లోకేష్ కు క్రిస్మస్ బహుమతులను షర్మిల పంపించారు. నిజానికి క్రిస్మస్ బహుమతులను పంపాల్సిన అవసరం షర్మిలకు లేదు. అయినా పంపారంటే తెరవెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుందనటంలో సందేహం లేదు. అంటే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అంటే ఇపుడు టీడీపీ-జనసేన పొత్తులో మరోపార్టీ చేరే అవకాశాలున్నాయి. కాకపోతే అది కాంగ్రెసా లేకపోతే బీజేపీనా అన్నదే తేలటం లేదు. ఇది తేలటానికి వచ్చే ఫిబ్రవరి వరకు వెయిట్ చేయక తప్పేట్లులేదని సైకిల్ నేతలంటున్నారు. ఈమధ్యనే ఢిల్లీలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఏపీకి సంబంధించి టీడీపీతో చేతులు కలిపే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. సో ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే అని అర్ధమవుతోంది. మరప్పుడైనా స్పష్టత వస్తుందా ?