ఆ ఇద్దరే టీడీపీ టార్గెట్....బ్రేకింగ్ న్యూస్ ఉంటుందా ?
ఒక ప్రభుత్వానికి కళ్ళూ ముక్కూ చేవులూ అంటే ఈ రెండు పోస్టులే అని చెప్పాల్సి ఉంది.
By: Tupaki Desk | 5 May 2024 9:40 AM GMTఏపీలో టీడీపీ నుంచి వస్తున్న ఏకైక డిమాండ్ ఇదే. వరసబెట్టి ఈసీకి విన్నపాలు చేస్తూనే ఉంది. ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డిని అలాగే డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిని బదిలీ చేయాలని టీడీపీ కోరుతూనే ఉంది. ఈ ఇద్దరూ ఇపుడు ప్రభుత్వంగా ఉన్నారు. ఒక ప్రభుత్వానికి కళ్ళూ ముక్కూ చేవులూ అంటే ఈ రెండు పోస్టులే అని చెప్పాల్సి ఉంది.
ఈసారి ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నాయి. ఇందులో రెండవ మాటకు అవకాశమే లేదు. ఎన్నికల్లో వ్యూహాలు అనేకం ఉంటాయి. ప్రచారం ఒక ఎత్తు. ఎలక్షనీరింగ్ మరో ఎత్తు. ఎలక్షనీరింగ్ విషయంలో పై చేయి సాధించాలంటే కొన్ని కీలక బదిలీలు జరిగి తీరాలని టీడీపీ కూటమి పట్టుదలగా ఉంది. చూడబోతే పోలింగ్ కి ఎనిమిది రోజులే గడువు ఉంది. దాంతో టీడీపీ నుంచి కీలక డిమాండ్ వస్తోంది.
ఏపీలో ప్రస్తుతం ఉన్న సీఎస్ డీజీపీలను బదిలీ చేయాలని కోరుతోంది. ఈ విషయంలో కనుక చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని అంటోంది. అయితే టీడీపీ గత నెల రోజులుగా ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నా పెద్దగా స్పందన అయితే రావడం లేదు.
ఈ విషయంలో టీడీపీలో అసహనం వ్యక్తం అవుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీతో పొత్తు అంటేనే వ్యవస్థలు తమకు అనుకూలంగా ఉంటాయని అలా చేస్తారని ఎంతో ఆశించింది. అయితే జరుగుతున్నది వేరొకటి అన్నట్లుగా ఉంది.
అయితే ఏపీకి వరసగా బీజేపీ అగ్ర నేతలు వస్తున్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆ మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈ ఇద్దరితో కలసి టీడీపీ కూటమి నేతలు ప్రచారంలో పాలు పంచుకోనున్నారు. దాంతో టీడీపీ తన డిమాండ్లు ఏమిటో బీజేపీ పెద్దల ముందే చెప్పి వారి మద్దతు కూడా కూడగడుతుందని అంటున్నారు.
పోలింగ్ కి కౌంట్ డౌన్ ప్రారంభం అయిన వేళ టీడీపీ పెడుతున్న ఈ డిమాండ్లకు బీజేపీ అగ్ర నేతల నుంచి ఏ రకమైన రియాక్షన్ వస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో ఎలక్షనీరింగ్ లో వైసీపీ అందె వేసిన చేయిగా మారిపోయింది. దానికి ఉదాహరణ 2021లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇక ఇదే తరహాలో 2024 ఎన్నికల్లో కూడా ఎలక్షనీరింగ్ చేయాలని వైసీపీ అధినాయకత్వం క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తోంది. దీంతో ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలత కూడా ఉండాలి.
మరి ఈ నేపధ్యంలో టీడీపీ ఏ రకంగా తన డిమాండ్లు సాధించుకోవడానికి ఏమి చేస్తుంది అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు. ఏపీలో చూస్తే నువ్వా నేనా అన్నట్లుగా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఏ ఒక్క ఓటునూ పోనీయకూడదు అన్నట్లుగానే అటు వైసీపీ ఇటు కూటమి పట్టుబట్టి ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీకి వస్తున్న ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు ఏపీలో రాజకీయం గేర్ మారుస్తారా అన్న చర్చ అయితే నడుస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.