ఉండి.. టీడీపీకి గండి!
టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. అంటే 1983 నుంచి 2019 ఎన్నికల వరకు.. ఒకే ఒక్కసారి ఇక్కడ టీడీపీ పరాజయం పాలైంది.
By: Tupaki Desk | 13 April 2024 3:59 AM GMTఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలుపు గుర్రంఎక్కే నియోజకవర్గం ఉండి. క్షత్రియ సామాజిక వర్గానికి ఇది కంచుకోట. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. అంటే 1983 నుంచి 2019 ఎన్నికల వరకు.. ఒకే ఒక్కసారి ఇక్కడ టీడీపీ పరాజయం పాలైంది. అది కూడా.. వైఎస్ పాదయాత్ర ప్రభావంతో 2004లో ఒకే ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. అంటే.. టీడీపీ ఆవిర్భవించిన ఈ 40 ఏళ్లలో ఈ నియోజకవర్గం ప్రజలు తెలుగు దేశాన్నే వరుసగా గెలిపిస్తూ వచ్చారు.
అంతటి బలమైన నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉన్నా.. ఉండిలో పార్టీ సునాయాసంగా విజయం దక్కించుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీడీపీలోనే పెరుగుతున్న అసంతృ ప్తులు.. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఉండి నియోజకవర్గంలో ఈ సారి గండి పడడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు టికెట్ ఆశించారు. అదేవిధంగా 2014లో గెలిచిన శివరామరాజు కూడా టికెట్ ఆశించారు.
ఈ ఇద్దరికీ కాకుండా.. చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారు. వాస్తవానికి తొలి జాబితాలోనే మంతెన రామరాజు టికెట్ దక్కించుకున్నారు. రఘురామ ఎపిసోడ్ నేపథ్యంలో ఈ సీటును ఆయనకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ, రఘురామ ఎంపీ సీటు కోసం పట్టుబడుతుండడంతో.. ఉండిని బీజేపీకి ఇచ్చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. దీంతో ఉండి నియోజకవర్గంలోటీడీపీ నాయకులే రెబల్స్‌గా రంగంలోకి దిగుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో నరసాపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన.. శివరామరాజు.. ఇప్పుడు రెబల్‌గా నామినేషన్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు కూడా.. రెబల్‌గా మారేందుకు రెడీ అయ్యారు. తనకుటికెట్ ఇవ్వకపోతే.. తన పరిస్థితి తనకు తెలుసునని ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరికీ కాకుండా.. బీజేపీకి ఇచ్చేస్తే.. ఏ గొడవా ఉండదని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. కానీ, గెలిచే స్థానంలో బీజేపీ ని తెచ్చిపెడితే.. అంతిమంగా.. టీడీపీకే నష్టమని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.