Begin typing your search above and press return to search.

కాలమహిమ అంటే ఇదే: అప్పుడు గుర్తింపు నిల్.. ఇప్పుడు అంత పెద్ద పార్టీ!

అలాంటి వాటిని కేసీఆర్ లాంటోళ్లు తమ చేతులారా తాము మిస్ చేసుకుంటారని చెప్పాలి.

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:31 AM GMT
కాలమహిమ అంటే ఇదే: అప్పుడు గుర్తింపు నిల్.. ఇప్పుడు అంత పెద్ద పార్టీ!
X

కలిసి వచ్చే కాలానికి తగ్గట్లు.. అణుకువతో మాట్లాడితే కాలం కలిసి రాని వేళలోనూ పెద్ద ఇబ్బందులు ఎదురుకావు. కానీ.. గులాబీ బాస్ కేసీఆర్ లాంటోళ్లు అలా ఉండరు కదా? తమ కసి మొత్తాన్ని మాటల్లో చూపించాలనుకోవటం.. వారికి తగ్గట్లే వారి వందమాగధులు రాసే స్క్రిప్టును వల్లె వేసే అధినేతలు కాలపరీక్షలో ఎంతలా తేలిపోతారన్న దానికి తాజా సీన్ ఒక నిదర్శనంగా చెప్పాలి. ఈ మొత్తం ఇష్యూలో నేర్చుకోవాల్సిన నీతి ఏమంటే.. రాజకీయాల్లో ఒక్కోసారి ఎవరికి అందలేనంత ఎత్తులో ఉండొచ్చు. కానీ.. కాలం తర్వాతి రోజుల్లో వారిని పాతాళానికి తొక్కేసేలా చేయొచ్చు. ఈ రెండింటిని గుర్తించి మెసులుకుంటే మర్యాదగా ఉంటుంది. అలాంటి వాటిని కేసీఆర్ లాంటోళ్లు తమ చేతులారా తాము మిస్ చేసుకుంటారని చెప్పాలి.

2019 లోక్ సభా ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. కేసీఆర్ కు అప్పటికే ఎదురుదెబ్బ తగిలింది. కాకుంటే దానికి కొద్ది నెలల ముందే వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో మంచి మెజార్టీతో అధికారాన్ని అందిపుచ్చుకున్న ఆయన.. ఏపీలోని తెలుగుదేశం గురించి మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. చంద్రబాబుకు రిటర్న్ గిప్టు ఇచ్చానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. గత లోక్ సభ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ 9 స్థానాల్ని సొంతం చేసుకోగా.. ఏపీలో టీడీపీ 3 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకుంది. ఆ తర్వాతి కాలంలో చాలానే ఇబ్బందుల్ని ఎదురు చూసింది. లోక్ సభలో తమ వాణిని వినిపించేందుకు సైతం ఇబ్బందికి గురైంది.

కట్ చేస్తే.. తాజాగా వెల్లడైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని టీడీపీ కూటమి ఏకంగా 22 స్థానాల్ని సొంతం చేసుకుంటే.. వైసీపీ మూడు స్థానాలకే పరిమితమైన పరిస్థితి. ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాల వేళ.. రిటర్న్ గిప్టు ఇవ్వాలి కదా అంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలకు కాలం తనదైన తీర్పును ఇచ్చింది. ఈసారి లోక్ సభా ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కటంటే ఒక్క సీటు రాకపోవటంతో.. లోక్ సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అదే సమయంలో.. టీడీపీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

మొత్తం 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న 18వ లోక్ సభలో సభ్యుల సంఖ్యా పరంగా చూస్తే టీడీపీ ఆరో అతి పెద్ద పార్టీగా నిలవటం గమనార్హం. మొత్తం సభలో బీజేపీకి 240 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగా అవతరించగా.. రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్ 99 స్థానాల్లో నిలిచింది. మూడో స్థానంలో సమాజ్ వాదీ పార్టీ 37 మంది ఎంపీలతో.. నాలుగో స్థానంలో టీఎంపీ (మమతా బెనర్జీ పార్టీ) 29 స్థానాల్లో.. ఐదో స్థానంలో డీఎంకే 22 మంది ఎంపీలతో నిలవగా.. టీడీపీ 16 మంది సభ్యులతో ఆరో స్థానంలో ఉంది. నిజానికి బీజేపీకి కేటాయించిన ఎంపీ సీట్లలో టీడీపీ పోటీ చేసి ఉంటే.. పక్కాగా గెలవటమే కాదు.. మరో ఒకట్రెండు స్థానాల్ని పెంచుకునే పరిస్థితి.

ఈ ఎన్నికల్లో మూడంకెల స్థానాల్ని ఒక్క బీజేపీ మాత్రమే సొంతం చేసుకుంది. కాకుంటే.. వయనాడ్ లో త్వరలో జరిగే ఉప ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ మూడంకెల స్థానాన్ని సొంతం చేసుకోవటం ఖాయం. నిజానికి ఇప్పటికే ఆ పార్టీ బలం మూడంకెలకు చేరుకుంది. కారణం.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ఎంపీలు ఒకరిద్దరు ఆ పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్లుగా పేర్కొనటం తెలిసిందే. తాజాగా కొలువు తీరే లోక్ సభలో 34 పార్టీలకు సింగిల్ డిజిట్ ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకున్నాయి. అందులో 16 పార్టీలు ఒక్క సీటును మాత్రమే గెలిచాయి. నాలుగు స్థానాల్లో గెలిచిన వైసీపీ పదిహేనో స్థానంలో నిలవగా.. చంద్రబాబుకు రిటర్న్ గిప్టు ఇచ్చానంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ కు 18వ లోక్ సభలో ఒక్క సభ్యుడు కూడా లేని దుస్థితి. కాలమహిమ అంటే ఇది కదా?