వార్ వన్ సైడ్ అయినా.. ఆ రెండూ దక్కలే !
అయితే ఇంతటి ఘనవిజయంలోనూ రెండు శాసనసభ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది.
By: Tupaki Desk | 6 Jun 2024 6:58 AM GMTఆంధ్రప్రదేశ్ శాసనసబ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి సునామీ సృష్టించింది. మొత్తం 175 శాసనసభ స్థానాలకు గాను టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 శాసనసభ స్థానాలను, టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 లోక్ సభ స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించాయి. గత ఎన్నికల్లో 151 శాసనసభ, 21 లోక్ సభ స్థానాలను గెలుచుకున్న అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితం అయింది.
అయితే ఇంతటి ఘనవిజయంలోనూ రెండు శాసనసభ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, కడప జిల్లా పులివెందుల శాసనసభ స్థానాలు టీీడీపీకి కొరకరాని కొయ్యలుగానే మిగిలిపోయాయి. పులివెందులలో 1978 నుండి వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వస్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం 1978లో రద్దయింది. తిరిగి 2009లో డీలిమిటేషన్ లో ఏర్పాటు చేశారు.
పులివెందులలో 1978, 1983, 1985, 1999, 2004, 2009 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 1994లో వైఎస్ వివేకానంద రెడ్డి, 2014, 2019 ఎన్నికలతో పాటు తాజా ఎన్నికల్లో మూడోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున 1955లో నక్కా వెంకటయ్య, 1960లో జె.రామిరెడ్డి, 1967, 1972లో కందుల ఓబుల్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గం రద్దై తిరిగి 2009లో ఏర్పడింది. 2009లో ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ తరపున గెలిచారు. 2014లో వైసీపీ తరపున డేవిడ్ రాజు, 2019 ఆదిమూలపు సురేష్ విజయం సాధించగా ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ 5200 ఓట్ల మెజారిటితో విజయం సాధించాడు.