వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే... వీడియో వైరల్!
వాస్తవానికి రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది నేతల మధ్య, కార్యకర్తల మధ్య స్పష్టమైన గీత కనిపిస్తుంది.
By: Tupaki Desk | 17 July 2024 11:29 AM GMTప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగా ఒకరిని ఒకరు కలుసుకునే సాహసం కూడా చేయడం లేదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కార్యకర్తలు, కొంతమంది ప్రజానికం కూడా రాజకీయ వైరాన్ని, వ్యక్తిగత వైరం స్థాయిలో చూస్తున్నారని అంటున్నారు. పైగా ఏపీలో టీడీపీ - వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్స్ పీక్స్ కి చేరాయని చెబుతున్నారు.
ప్రధానంగా ఏపీలో 2014 నుంచి ఈ తరహా వాతావరణం ఉందని అంటున్నారు. పక్కనున్న తెలంగాణలో బీఆరెస్స్ – కాంగ్రెస్ నేతల మధ్య ఇలాంటి వాతావరణమే ఉండగా.. ఏపీలో వైసీపీ - టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఇంటికి టీడీపీ ఎమ్మెల్యే వెళ్లడం ఆసక్తిగా మారింది.
అవును... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఎం.ఎస్. రాజు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఎర్రా లక్కప్పపై 351 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది నేతల మధ్య, కార్యకర్తల మధ్య స్పష్టమైన గీత కనిపిస్తుంది.
అయితే... మడకశిరలో మాత్రం అందుకు భిన్నమైన, ఆహ్వానించదగ్గ వాతావరణం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు... వైసీపీ అభ్యర్థి లక్కప్ప ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా విరిరువురూ... నియోజకవర్గ అభివృద్ధికి కార్యచరణ ప్రణాళికపై చర్చించినట్లు చెబుతున్నారు. దీంతో... ఇది ఎంతో అద్భుతమని, పూర్తిగా ఆహ్వానించదగ్గ పరిణామమని అంటున్నారు పరిశీలకులు.
కాగా... ఇటీవల జరిగిన ఎన్నికలు ఏ స్థాయిలో హోరాహోరీగా జరిగాయనేది తెలిసిన విషయమే. అయినప్పటికీ నిరాడంబరమైన నేపథ్యం ఉంచి రాజకీయాల్లోకి వచ్చిన వీరు.. ఎన్నికల్లో గెలుపోటములను క్రీడా స్పూర్తితో చూడటమే కాకుండా.. ఎన్నికల తర్వాత పరస్పర గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకున్నారనే చెప్పాలి. వీరి కలయికకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది!