Begin typing your search above and press return to search.

ఓవర్ టూ ఢిల్లీ : అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్యలో ఈసీ...!

వీటి విషయంలో తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నామని ఆయన చెప్పారు. అనుకున్నట్లే ఈసీని అటు టీడీపీ ఇటు వైసీపీ కలవబోతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Aug 2023 4:36 AM GMT
ఓవర్ టూ ఢిల్లీ : అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్యలో ఈసీ...!
X

ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజిలో సాగుతుందో అందరికీ తెలిసిందే. ప్రతీ రోజూ ఏపీ రాజకీయాన్ని వేడెక్కించే పనిలో రెండు పార్టీలు ఉన్నాయి. కౌంటర్లు, ప్రతి కౌంటర్లు సెటైర్లు ఇలా అటూ ఇటూ మాటలతోనే దాడులు చేసుకుంటూ ఉంటారు.

ఇపుడు ఈ కధ కాస్తా ఢిల్లీకి షిఫ్ట్ అవుతోంది. ఈ నెల 28న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఏపీలో దొంగ ఓట్లు నకిలీ నోట్లు పెద్ద ఎత్తున ఉన్నాయని ఫిర్యాదు చేయబోతున్నారు. వైసీపీ వాటిని చేర్పించిందని వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేయబోతున్నారుట.

లక్షలలోనే వైసీపీ దొంగ ఓట్లను చేర్పించింది అని బాబు తో పాటు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అదంతా తప్పు అని వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ముందుగా సజ్జల మాటలనే తీసుకుంటే చంద్రబాబుకే ఇలాంటి పనులలో పీ హెచ్ డీ ఉందని ఎద్దేవా చేశారు.

ప్రజాదరణ ఉన్న తమకు దొంగ ఓట్లు ఎందుకు అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏపీలో పలు చోట్ల దొంగ ఓట్లు చేర్పించింది అని ఆయన ఆరోపించారు. దాని మీద తాను ఫిర్యాదు చేసి తప్పిస్తూంటే టీడీపీ గగ్గోలు పెడుతోంది అని అన్నారు.

ఇదే విషయం మీద వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా టీడీపీ మీద మండిపడుతున్నారు. చేసిందంతా టీడీపీ చేసి మా మీద నిందలా అని ఆయన అంటున్నారు. టీడీపీ ఏపీలో దాదాపుగా అరవై లక్షల ఓట్లను దొంగవి నకిలీవి చేర్పించింది అని ఆయన ఆరోపించారు. అందులో ఒక్క కుప్పంలోనే నలభై వేల ఓట్లు ఉన్నాయని ఇవన్నీ కుప్పం సమీపంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున చేర్పించినవే అని ఆయన అంటున్నారు.

ఏపీలో మొత్తం రాష్ట్రంలో 3 కోట్ల 90 లక్షల ఓట్లు ఉండగా అందులో 60 లక్షలు నకిలీవేనని ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. 2018-2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఓటర్ల జాబితాలో చేర్చారని పెద్దిరెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు. వీటి విషయంలో తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నామని ఆయన చెప్పారు. అనుకున్నట్లే ఈసీని అటు టీడీపీ ఇటు వైసీపీ కలవబోతున్నాయి.

ఈ నెల 28న మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఈసీని కలవబోతున్నారు. ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటల తరువాత వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈసీని కలసి ఏపీలో అరవై లక్షల దొంగ నోట్ల గురించి ఆధారాలతో సహా వివరిస్తాయని అంటున్నారు.

ఇలా ఢిల్లీకి మారిన పంచాయతీలో ఎవరి వాదన నెగ్గుతుంది. ఈసీ ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. దొంగ ఓట్లు ఎపుడూ ప్రజాస్వామ్యానికి చేటే. అసలు ప్రజా తీర్పుని మరుగున పడేస్తుంది. మరి ఏపీలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు దొంగ ఓట్లు నకిలీ ఓట్లు అంటున్నాయి. చర్యలు తీసుకోమంటున్నాయి. ఈసీ కూడా అదే చేయాలనుకుంటోంది. మరి ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో చూడాలి. వైసీపీ టీడీపీలు ప్రత్యర్ధి మీదనే వేలు పెట్టి ఆరోపిస్తున్నాయి.

ఇది నిజంగా ఈసీకి అత్యంత క్లిష్ట సమస్యగా ఉంది అంటున్నారు. ఈసీ స్వతంత్ర సంస్థ. పూర్తి పవర్స్ ఉన్నాయి. అందువల్ల దొంగ ఓట్లు అంటే వారూ వీరూ తేడా చూపకుండా ఏరిపారేయాలని డిమాండ్ అయితే మేధావుల నుంచి ప్రజాస్వామ్య ప్రియుల నుంచి వస్తోంది.