Begin typing your search above and press return to search.

విశ్వ‌స‌నీయ‌త‌కు నిలువెత్తు గౌర‌వం.. ఎర్ర‌న్న కుటుంబానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం!

రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కాలు చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంటాయి. నాయ‌కులు పార్టీల‌పై చూపించే అభిమానం

By:  Tupaki Desk   |   13 Jun 2024 12:30 PM GMT
విశ్వ‌స‌నీయ‌త‌కు నిలువెత్తు గౌర‌వం.. ఎర్ర‌న్న కుటుంబానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం!
X

రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కాలు చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంటాయి. నాయ‌కులు పార్టీల‌పై చూపించే అభిమానం.. పార్టీ అధినాయ‌కుల ప‌ట్ల చూపించే విశ్వాసం వంటివి కీల‌కం. ఈ రెండు కాపాడుకుని.. పార్టీ కోసం అంకిత భావంతో సేవ‌లు చేసిన వారికి.. పార్టీల అధినాయ‌కులు కూడా అంతే విశ్వాసం చూపిస్తార‌న‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ ఏపీలోని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఎర్ర‌న్న కుటుంబం. ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్ర‌న్నాయుడు.. టీడీపీ ప్రారంభించిన నాటి నుంచి ఆ పార్టీలో కీల‌కంగా ఉన్నారు. కేంద్రంలోనూ మంత్రిగా ప‌నిచేశారు. తొలుత అన్న‌గారు ఎన్టీఆర్‌కు విధేయులుగా ఉన్న ఎర్రన్నాయుడు.. త‌ర్వాత కాలంలో చంద్ర‌బాబు కు కూడా సానుకూలంగా వ్య‌వ‌హ‌రించారు.

చంద్ర‌బాబు ఏం చెబితే అదే చేశారు. రాష్ట్రం వ‌ద్దు కేంద్రానికి వెళ్ల‌మంటే వెళ్లారు. ఇలా.. ఆయ‌న చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే రాజ‌కీయాలు చేశారు. దీంతో చంద్ర‌బాబుకు ఎర్ర‌న్నాయుడుకు మ‌ధ్య అవినాభావ వాత్స‌ల్యం పెరిగింది. అనంతర కాలంలో ఎర్ర‌న్నాయుడు త‌న సోద‌రుడు అచ్చెన్నాయు డిని తీసుకువ‌చ్చారు. ఆయ‌న‌కు కూడా చంద్ర‌బాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇక‌, ఎర్ర‌న్నాయుడికి కేంద్రంలో మంత్రి ప‌ద‌విని కూడా ఇప్పించారు. తూర్పు వెలమ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో శ్రీకాకుళంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనూ ఎర్ర‌న్నాయుడు కీల‌కంగా వ్య‌వ‌హ రించారు. ఇలా.. పార్టీకి, పార్టీ అధినేత‌కు కూడా ఎర్ర‌న్న అంకిత భావంతో వ్య‌వ‌హ‌రించారు.

అయితే.. అనూహ్యంగా 2011లో ఎర్ర‌న్నాయుడు.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఆయ‌న వార‌సుడిగా.. రామ్మోహ‌న్‌నాయుడుకు చంద్ర‌బాబు ప్రాధా న్యం ఇచ్చారు. ఆయ‌న‌కు 2014లో ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు చంద్ర‌బాబు. త‌ర్వాత‌.. ఎర్ర‌న్నాయుడును అదే ఏడాది మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. అంతేకాదు.. త‌ర్వాత కాలంలో అచ్చెన్నను రాష్ట్ర టీడీపీ చీఫ్‌గా కూడా ప్ర‌మోట్ చేశారు. ఇలా.. ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌గానే ఎర్ర‌న్న కుటుంబానికి పెద్ద‌పీట వేశారు. ఆయ‌న కుమారుడు, ఎంపీ రామ్మోహ‌న్‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇప్పించా రు.

ఇక‌, అచ్చెన్నాయుడును త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. అలానే ఎర్ర‌న్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీకి 2019లో రాజ‌మండ్రి సిటీ నియోజ‌క వ‌ర్గం టికెట్ ఇచ్చారు. తాజా ఎన్నిక‌ల్లో ఆమె కోరిక మేర‌కు.. ఆమె భ‌ర్త ఆదిరెడ్డి శ్రీనివాసుకు రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం ఇచ్చారు. ఆయ‌న ను గెలిపించుకున్నారు కూడా. ఇలా.. ఎర్ర‌న్న కుటుంబం పార్టీకి చేసిన మేలు , చూపిన అంకిత భావం నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా.. ఎర్ర‌న్న కుటుంబానికి ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.