పెద్దల సభలో టీడీపీ జీరోనా..!
మరో ముచ్చట చెప్పాలీ అంటే 1984లో టీడీపీ లోక్ సభలో 35 మంది ఎంపీలతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది.
By: Tupaki Desk | 28 Dec 2023 2:45 AM GMTతెలుగుదేశం పార్టీ పుట్టాక పెద్దల సభలో కనీసం ఒక్క మెంబర్ లేకుండా జీరో కావడం ఫస్ట్ టైం జరగబోతోంది. ఆ పార్టీ సౌతిండియాలో అతి పెద్ద స్టేట్ అయిన ఉమ్మడి ఏపీలో బలంగా ఉంటూ వచ్చింది. అధికారంలో అనేక ఏళ్ల పాటు ఉంది. ఆ సమయంలో రాజ్యసభలో టీడీపీకి పెద్ద ఎత్తున మెంబర్లు ఉండేవారు. మరో ముచ్చట చెప్పాలీ అంటే 1984లో టీడీపీ లోక్ సభలో 35 మంది ఎంపీలతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది.
ఎంతో మంది మేధావులు కీలక నేతలు సీనియర్లు కూడా టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. అలాగే సినీ ప్రముఖులు రావు గోపాలరావు, మోహన్ బాబు, జయప్రద వంటి వారు కూడా టీడీపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు. అలాంటి అత్యున్నత పెద్దల సభ అయిన రాజ్యసభలో టీడీపీ ఫస్ట్ టైం ఒక్క మెంబర్ లేకుండా జీరో కాబోతోంది.
దానికి కారణం టీడీపీకి 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో రాజ్యసభ నుంచి ఒక్క కొత్త మెంబర్ ని కూడా పంపించుకోలేకపోయింది. 2020, 2022లో రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికలు జరిగితే ఏపీ అసెంబ్లీలో 151 మంది సభ్యులు కలిగిన వైసీపీయే అన్ని సీట్లను వరసగా గెలుచుకుంది. దాంతో ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు.
ఇదిలా ఉంటే 2024 మార్చిలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి. టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ రిటైర్ కాబోతున్నారు. అలాగే టీడీపీలో గెలిచి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియనుంది. దాంతో ఇపుడున్న లెక్కల ప్రకారం ఈ రెండు సీట్లూ వైసీపీ ఖాతాలో పడనున్నాయని అంటున్నారు.
మార్చిలో ఈ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. దాంతో వైసీపీ ఈ సీట్లను గెలుచుకునే చాన్స్ ఉంది. అదే సమయంలో టీడీపీకి జీరో నంబర్ మిగిలే అవకాశం ఉంది అంటున్నారు. రేపటి రోజున టీడీపీకి ఎమ్మెల్యేల నంబర్ పెరిగినా కూడా 2026లో కానీ ఆ పార్టీ నుంచి కొత్త మెంబర్ రాజ్యసభలో అడుగుపెట్టరని అంటున్నారు. అంటే అంతవరకూ వేచి చూడాల్సిందేనా అంటే అవును అంటున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ నుంచి రెండు రాజ్యసభ సీట్లు అంటే ఎవరికి ఇస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. బీసీలకు కచ్చితంగా ఇస్తారని అంటున్నారు. అలాగే మైనారిటీ కోటా కూడా ఈసారి భర్తీ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి సార్వత్రిక ఎన్నికల వేళ రాజ్యసభ ఎన్నికలు జరగడం శుభ పరిణామం అని అంటున్నారు.