తలపై పలకతో కొట్టిన టీచర్... ఘోరం జరిగిపోయింది!
ఓ ప్రైవేటు స్కూల్ లో యూకేజీ చదువుతున్న హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు సుమారు రెండు రోజులుగా హాస్పటల్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు
By: Tupaki Desk | 3 Oct 2023 5:21 AM GMTబెత్తం వాడని పిల్లల భవిష్యత్తు బాగుండదని చెబుతుంటారు.! దానర్ధం... రక్తం వచ్చేలా, వేళ్లు విరిగేలా, ఒక్కోసారి మృతిచెందేలా అని కాదు! ఈ ఇంగితం లేని కొంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లుగా చెలామణి అవుతున్న టీచర్లు... పిల్లలతో ఎలా నడుచుకోవాలో తెలియక శృతిమించిన ఆగ్రహాన్ని చూపిస్తుంటారని.. ఆ అగ్రహంలో ఇచ్చిన పనిష్మెంట్ తో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వస్తుంటుందనే సంఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలో తాజాగా అలాంటి సంఘటనే రామాంత్ పూర్ లో జరిగింది.
అవును... హైదరాబాద్ లోని రామంతాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ లో యూకేజీ చదువుతున్న హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు సుమారు రెండు రోజులుగా హాస్పటల్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. దీనికి కారణం.. ఆ బాలుడు హోంవర్క్ చేయలేదని, ఆ కోపంతో టీచర్ తలపై కొట్టిందని అంటున్నారు.
హోంవర్క్ చేయలేదనే కోపంతో ఆ బాలుడి తలపై టీచర్ కోపంతో పలకతో కొట్టిందని.. చిన్నారి వెంటనే స్పృహ తప్పిపడిపోయాడని ఆరోపణలొచ్చాయి. ఈ ఘటన శనివారం జరిగింది. దీంతో ప్రిన్సిపల్ ఇచ్చిన సమాచారంతో బాలుడి తల్లి పాఠశాలకు వచ్చింది. అప్పటికే బాలుడి బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండటంతో జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి, అనంతరం మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతున్న హేమంత్ మృతి చెందాడు. దీంతో తల్లితండ్రులు కొడుకు మృతదేహంపై పడి కన్నీరు మున్నీరుగా రోదించారు!
కాగా... మృతుడు రామంతాపూర్ భరత్ నగర్ లో నివసించే బి.నాగరాజు - రాధ దంపతుల కుమారుడైన హేమంత్ అని తెలుస్తుంది! వివేక్ నగర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. శనివారం బడికి వెళ్లగా హోంవర్క్ చేయలేదంటూ హేమంత్ ను టీచర్ తలపై పలకతో కొట్టడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు!
దీంతో… టీచర్ కొట్టడం వల్లే చిన్నారి మరణించాడంటూ సోమవారం పాఠశాల ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున జనం గుమిగూడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని పాఠశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.