Begin typing your search above and press return to search.

క్లాస్ రూంలో రీల్స్.. టీచరమ్మకు షాక్

సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ పాపులర్ అవుతున్న వైనంపై విద్యాశాఖ అధికారులు కన్నెర్ర చేశారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:34 AM GMT
క్లాస్ రూంలో రీల్స్.. టీచరమ్మకు షాక్
X

రంగం ఏదైనా.. తమకంటూ ప్రత్యేకతను పది మందికి తెలియాలన్న తపన కొందరిలో ఉంటుంది. అదేం తప్పు కాదు. కానీ.. ప్రొఫెషనల్ జీవితానికి.. వ్యక్తిగత జీవితానికి మధ్య ఉండే గీత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఒక టీచరమ్మ విషయంలో ఇలాంటి సీనే చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పని చేసే టీచరమ్మ ఒకరు క్లాస్ రూంలో పాఠాలు చెప్పాల్సిన చోట.. సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ పాపులర్ అవుతున్న వైనంపై విద్యాశాఖ అధికారులు కన్నెర్ర చేశారు. దీంతో.. సస్పెండ్ అయిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా మీద ఉన్న షోకు.. ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది. అసలేం జరిగిందంటే.

ఉత్తరప్రదేశ్ లోని షికార్ పూర్ మండలం మేవాడ గ్రామంలో టీచర్ గా పని చేస్తున్నారు ప్రభా నేగి. పాఠాలు చెప్పాల్సిన క్లాస్ రూంలో.. ఆ పనిని వదిలేసి రీల్ వీడియోలు చేస్తున్న వైనం ఉన్నతాధికారులకు ఫిర్యాదు రూపంలో అందింది. ప్రభానేగి వీడియోల్లో డాన్సులు.. అభ్యంతరకర వీడియోలు ఉండటాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ టీచరమ్మ తన చిట్టి వీడియోలతో తెగ పాపులర్ అయ్యింది.

అయితే.. వీడియోలు చేయాల్సిన చోటును ఎంచుకునే విషయంలో ఆమె చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. క్లాస్ రూంలో వీడియోల్ని చేసే ఆమె.. అభ్యంతరకర డ్యాన్సుల వీడియోల్ని తన సెల్ ఫోన్ తోనే షూట్ చేసుకునేవారు. ఆమె తీరుపై తోటి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్లాస్ రూంలో ఇవేం పిచ్చిపనులు అంటూ ఆమెపై వెళ్లిన కంప్లైంట్ పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆమెపై విచారణ కమిటీ వేసిన ఉన్నతాధికారులు వారు అందించిన నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.