గౌరవనీయ ఎమ్మెల్యే రివాబా.. సంప్రదాయానికి జడేజా భార్య విలువ
రివాబా గుజరాత్ లోని జామ్ నగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రివాబా గుజరాత్ అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నమాట.
By: Tupaki Desk | 10 March 2025 10:00 PM ISTటీమ్ ఇండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు జట్టు ఆటగాళ్ల భార్యలు హాజరవడం హైలైట్ గా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి సతీమణి అనూష్క శర్మ, మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాలను టీవీ కెమెరాలు పదేపదే చూపించాయి. అయితే, వీరిలో అందరికంటే రివాబా గురించే ఎక్కువ చర్చ నడించిందంటే ఆశ్చర్యం లేదు.
అంతా నీలి రంగులో..
దుబాయ్ లో ఆదివారం ఫైనల్ జరిగిన స్టేడియంలో 90 శాతం పైగా బ్లూ (నీలి) రంగే కనిపించింది. టీమ్ ఇండియా ఆటగాళ్లది నీలి రంగు జెర్సీ కావడమే దీనికి కారణం. మొదటినుంచి భారత ఆటగాళ్లు బ్లూ జెర్సీలనే ధరించేవారు. కాబట్టి కొన్నేళ్ల కిందటి వరకు మెన్ ఇన్ బ్లూ అని మన జట్టును పేర్కొనేవారు. ఆ తర్వాత టీమ్ ఇండియా అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద టోర్నీల సందర్భంగా అభిమానులంతా బ్లూ జెర్సీలతో హోరెత్తిస్తుంటారు.
ఇక ఫైనల్ కు హాజరైనవారిలో కోహ్లి సతీమణి అనూష్క, రోహిత భార్య రితికా ఫ్యాషన్ గా కనిపించారు. వారు మోడ్రన్ దుస్తుల్లో ఉండడాన్ని అభిమానులు గమనించారు. కానీ, రివాబా మాత్రం సంప్రదాయ చీర కట్టులో కనిపించారు. దీంతో అభిమానులంతా ఇప్పుడు ఈ విషయమై చర్చించుకుంటున్నారు.
మేడమ్ ఎమ్మెల్యే..
రివాబా గుజరాత్ లోని జామ్ నగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రివాబా గుజరాత్ అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నమాట. వేలమంది ప్రజలకు ప్రతినిధి అయిన ఆమె అంతే హుందాగా కనిపించే ఉద్దేశంతో సంప్రదాయ దుస్తులు ధరిస్తుంటారు.
రివాబా పూర్తిగా సంప్రదాయవాది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం అనంతరం తన భర్త జడేజాకు పాదాభివందనం చేశారు. అప్పుడూ సంప్రదాయ దుస్తులే ధరించారు. కాగా, రివాబాపై ఆమె మామ, జడేజా తండ్రి గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబంలోకి రివాబా వచ్చాకే సమస్యలు మొదలయ్యాయని ఆయన ఆరోపించారు.