ఈ ఏడాది వీటిలో ఉద్యోగాలు మెండు!
ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ భయాలు, ఆర్థిక మాంద్యం వంటివి వెంటాడుతున్నాయి. ఇవి అందరిలో ఆందోళన రేపుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Aug 2024 9:30 AM GMTప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ భయాలు, ఆర్థిక మాంద్యం వంటివి వెంటాడుతున్నాయి. ఇవి అందరిలో ఆందోళన రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులను చేపట్టాయి. దీంతో కొత్త ఉద్యోగుల నియామకాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే ఈ ఆందోళనలను ప్రముఖ సంస్థ.. టీమ్ లీజ్ ఎడ్ టెక్ కెరీర్ సంస్థ పటాపంచలు చేసింది.
ఈ ఏడాది రెండో సగంలో కంపెనీలు భారీ ఎత్తున ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయని టీమ్ లీజ్ ఎడ్ డెక్ కెరీర్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జూలై –డిసెంబర్ కు సంబంధించి నివేదికను తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 603 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. కంపెనీలు తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
ఈ ఏడాది రెండో సగంలో నియామక సంస్థలు 72 శాతం ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వడాఇనికి సంసిద్ధంగా ఉన్నాయని టీమ్ లీజ్ తెలిపింది. గతేడాది పోలిస్తే ఇది 7 శాతం అధికమని వివరించింది. ఉద్యోగ నియామకాలు క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొంది. తాజాగా ఉత్తీర్ణులై మంచి నైపుణ్యాలు ఉన్నవారిని నియమించుకోవడానికి కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని టీమ్ లీజ్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగం వస్తుందా, రాదా అనే భయాలను ఫ్రెషర్లు వీడాలని టీమ్ లీజ్ తెలిపింది. నైపుణ్యాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తే ఉద్యోగాలు పొందడం కష్టమేమీ కాదని వెల్లడించింది. నైపుణ్యాలు ఉన్నవారిని ప్రోత్సహించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని టీమ్ లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు.
ముఖ్యంగా ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్, ఇంజనీరింగ్ సంస్థలు, మౌలిక వసతుల కల్పన సంస్థలు, రిటైల్ సంస్థలు తాజా ఉత్తీర్ణులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు టీమ్ లీజ్ వెల్లడించింది.
ఫుల్–స్టాక్ డెవలపర్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్‌ఈవో), డిజిటల్ సేల్స్ అసోసియేట్, యూజర్ ఇంటర్ ఫేజ్ డిజైనర్లకు అవకాశాలు బాగా ఉన్నాయని టీమ్ లీజ్ తెలిపింది. అలాగే సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ లో నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఇక నగరాల వారీగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఉన్న బెంగళూరులో 74 శాతం, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 60 శాతం, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నగరం చెన్నైలో 54 శాతం కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.
ఆర్థిక మాంద్యం, యుద్ధ భయాలు, ప్రపంచ అనిశ్చిత వాతావరణం వంటివాటితో ఉద్యోగ నియామకాలు ఉంటాయో, లేదోనని ఆందోళన చెందుతున్నవారికి టీమ్ లీజ్ శుభవార్త చెప్పింది.