Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఐటీ కంపెనీ సీఈవో కిడ్నాప్.. అసలు కారణం తెలిస్తే షాకే

అయితే.. పోలీసుల ఎంట్రీతో ఇంతకాలం జీతాల్లేకుండా ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల్లో కొందరు అత్యుత్సాహంతో చేసిన పనికి నిందితులుగా మారినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 July 2024 12:30 PM GMT
హైదరాబాద్ ఐటీ కంపెనీ సీఈవో కిడ్నాప్.. అసలు కారణం తెలిస్తే షాకే
X

ప్రధాన మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ క్రైం ఆద్యంతం సినిమాల్లోనూ.. ఓటీటీ ప్లాట్ ఫాంలో ప్లే అయ్యే వెబ్ సిరిస్ ను తలపించేలా ఉంది. హైదరాబాద్ కు చెందిన ఒక ఐటీ కంపెనీ సీఈవో జీతాలు ఇవ్వకుండా ఉండటంతో అతడ్ని ఆ సంస్థ ఉద్యోగులే (?) కిడ్నాప్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. పోలీసుల ఎంట్రీతో ఇంతకాలం జీతాల్లేకుండా ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల్లో కొందరు అత్యుత్సాహంతో చేసిన పనికి నిందితులుగా మారినట్లుగా తెలుస్తోంది. సినిమాటిక్ మాదిరి ఉన్న ఈ మొత్తం ఎపిసోడ్ పై పోలీసులు వెల్లడిస్తున్న వివరాల్ని చూస్తే..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ హుడా ఎన్ క్లేవ్ కు చెందిన రవిచంద్రారెడ్డికి టీహబ్ సమీపంలోని ఆర్బిట్ మాట్ లో గిగ్లైజ్ పేరుతో ఒక ఐటీ కంపెనీ ఉంది. దీన్ని గత నవంబరులో స్టార్ట్ చేశారు. కన్సెల్టెన్సీల ద్వారా 1500 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి.. దశల వారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. కొద్ది నెలలు జీతాలు ఇచ్చినా.. జనవరి నుంచి మాత్రం ఇవ్వట్లేదు. ఈ నెల తొమ్మిదిన అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో అతడి ఇంటికి ఎనిమిది మంది కన్సల్టింగ్ సభ్యులు ఉన్నారు. కాసేపు మాట్లాడి.. రవిచంద్రారెడ్డిని అతడి స్నేహితుడు మోహన్ ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. సిటీలో పలుచోట్ల తిప్పి చివరకు నాగర్ కర్నూలు జిల్లాలోని ఒంగూరులో ఉన్న హోటల్లో బంధించారు.

రవిచంద్రారెడ్డి.. మోహన్ లను తమతో తీసుకెళ్లినప్పటికీ.. మధ్యలో మోహన్ తప్పించుకున్నాడు. మరోవైపు తన కొడుకు ఇంటికి రాని నేపథ్యంలో అతడి తల్లి వాకాటి మాధవి జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతోరంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టటం.. విషయాన్ని అర్థం చేసుకున్న వారు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రవిచంద్రారెడ్డితో పాటు వారు తీసుకెళ్లిన 82 ల్యాప్ టాప్ లు.. కొన్ని ఫోన్లు.. రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

కిడ్నాప్ కు పాల్పడిన జగదీశ్.. గౌతం.. సుజిత్.. శివ.. అజాద్.. మల్లేష్.. ప్రవీణ్.. కమల్ లపై కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో శుక్రవారం కంపెనీకి చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జాబ్ ఇస్తామన్న పేరుతో తమ వద్ద రూ.15 కోట్లు వసూలు చేసినట్లుగా వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అంతేకాదు.. రవిచంద్రారెడ్డి ఇటీవల ఎంపీ ఎన్నికల్లో విజయవాడ నుంచి ఒక పార్టీ తరఫున పోటీకి దిగి మధ్యలోనే వెనక్కి వచ్చేశారని.. అతని సోదరి చాందిని రెడ్డి సైతం నంద్యాల ఎన్నికల బరిలో నిలిచినట్లుగా ఆరోపించారు. తమ డబ్బులతోనే ఈ పనులు చేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వని కారణంగానే మాట్లాడేందుకు తమతో తీసుకెళ్లామని కన్సల్టింగ్ కంపెనీ సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కన్సల్టెన్సీ ఉద్యోగులు మిస్ అయిన పాయింట్ ఏమంటే.. బలవంతంగా తీసుకెళితే కిడ్నాప్ అవుతుందని.. అది కేసుగా మారుతుందని.. దానికి బదులుగా పోలీసులకు చేసిన మోసం గురించి ఫిర్యాదు ఇచ్చి.. చట్టప్రకారం చర్యలకు డిమాండ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు డబ్బులు పోవటం.. కొత్త కేసుల్లో చిక్కుకోవటం గమనార్హం.