Begin typing your search above and press return to search.

ఒక్క టెక్నికల్‌ ఎర్రర్‌.. స్తంభించిన ప్రపంచం!

ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీమయమైపోయింది. అన్ని రంగాలు టెక్నాలజీపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   20 July 2024 6:33 AM GMT
ఒక్క టెక్నికల్‌ ఎర్రర్‌.. స్తంభించిన ప్రపంచం!
X

ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీమయమైపోయింది. అన్ని రంగాలు టెక్నాలజీపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. ఆయా కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలకు ఆయా ఐటీ దిగ్గజ సంస్థలు సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా టెక్నికల్‌ ఎర్రర్‌ తలెత్తితే.. ఆ సంస్థకు చెందిన సాఫ్ట్‌ వేర్‌ వాడుతున్నవారంతా అల్లకల్లోలం కావాల్సిందే. ఇప్పుడిదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సేవలు పొందుతున్న సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలు కొన్ని గంటల పాటు చుక్కలు చూశాయి.

ప్రపంచవ్యాప్తంగా 73 శాతం ల్యాప్‌ ట్యాప్‌లు, డెస్క్‌ ట్యాపులు మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పైనే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో జూలై 19న మైక్రోసాఫ్ట్‌ లో తలెత్తిన ఒక ఎర్రర్‌ తో కొన్ని గంటలపాటు అన్ని కంప్యూటర్‌ వ్యవస్థలు స్తంభించాయి. ఆయా సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

కంప్యూటర్‌ లేదా ల్యాప్‌ ట్యాప్‌ ఆన్‌ చేయగానే ఒక దశ వరకు వచ్చి.. బ్లూ స్క్రీన్‌ లో ఎర్రర్‌ రావడం, మళ్లీ దానంతట అదే క్లోజ్‌ అయిపోవడం.. మళ్లీ దానంతట అదే రీస్టార్ట్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఓఎస్‌ వాడుతున్న వారు, కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు స్తంభించిపోయాయి. ఎక్కడి కార్యకలాపాలు అక్కడి నిలిచిపోయాయి.

మైక్రోసాఫ్ట్‌ లో ‘బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌’ సమస్య తలెత్తింది. దీంతో ఇంటర్నెట్‌ పైన ఆధారపడి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కొన్ని గంటలపాటు కుప్పకూలాయి. విమానాలు ఎగరలేదు.. ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి.. స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి... మీడియా ప్రసారాలు నిలిచిపోయాయి.. రైల్వేలు.. కమ్యూనికేషన్, బ్యాంకింగ్‌ వ్యవస్థలకు, సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో మైక్రోసాఫ్ట్‌ షేర్లు పతనమయ్యాయి. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ లో ఈ టెక్నికల్‌ ఎర్రర్‌ ప్రభావం తక్కువగా ఉందని అంటున్నారు.

కాగా ఈ టెక్నికల్‌ ఎర్రర్‌ వెనక సైబర్‌ దాడో లేక సెక్యూరిటీ పరమైన సమస్యో లేదని మైక్రోసాఫ్ట్‌ సంస్థకు సైబర్‌ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్‌ స్ట్రైక్‌ స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ తో పనిచేసే కంప్యూటర్లలో తాము విడుదల చేసిన ‘అప్‌డేట్‌’ లో లోపాల కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్‌ స్ట్రైక్‌ అసలు కారణాన్ని వివరించింది. అయితే కొద్ది గంటల్లోనే ఈ సమస్యను పరిష్కరించామని తెలిపింది. అక్కడక్కడ స్వల్పంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సేవల్లో అంతరాయానికి వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది.

బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సేవలు పొందుతున్నవన్నీ బాగా ప్రభావితమయ్యాయి. టెక్నికల్‌ ఎర్రర్‌ తో కంప్యూటర్లను యాక్సెస్‌ చేసే వీలు లేకుండా పోయింది. ముఖ్యంగా విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గగ్గోలు పెట్టారు.

మనదేశంలో పలు విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు ఎయిర్‌ పోర్టులో 90 శాతం విమాన సర్వీసులపై ప్రభావం పడింది. పలు సంస్థల విమానాలు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ లో సాంకేతిక సమస్యతో ప్రపంచంలోనే పేరున్న వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్‌ వంటివి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

కాగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ లో టెక్నికల్‌ ఎర్రర్‌ తో మనదేశంలో ప్రభావం స్వల్పంగానే ఉందని చెబుతున్నారు. ఈ సమస్యతో ప్రధానంగా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల కార్యకలాపాలకు స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్, ఏంజెల్‌ వన్, 5పైసా తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. మనదేశంలో ప్రభావం తక్కువ ఉండటానికి మైక్రోసాఫ్ట్‌ క్రౌడ్‌ స్ట్రైక్‌ సేవలను పొందే సంస్థలు తక్కువ ఉండటమే కారణమంటున్నారు.

కాగా మనదేశంలో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ నెట్వర్క్‌ బాగానే ఉందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌ టెక్నికల్‌ ఎర్రర్‌ పరిష్కారానికి అప్‌ డేట్లు విడుదలయ్యాయన్నారు. ఒకటి, రెండు సంస్థల సాప్ట్‌వేర్లపైనే ఆధారపడితే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయని నిపుణులు తెలిపారు

డెస్క్‌ ట్యాప్, ల్యాప్‌ ట్యాప్‌ ల్లో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఓఎస్‌ వాడుతున్నవారికి బ్లూ స్క్రీన్‌ లో కనిపిస్తున్న ఈ ఎర్రర్స్‌ ను బ్లాక్‌ స్క్రీన్‌ ఎర్రర్స్‌ లేదా స్టాప్‌ కోడ్‌ ఎర్రర్స్‌గా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విండోస్‌ ఒక్కసారిగా షట్‌ డౌన్, లేదా రీస్టార్ట్‌ అవుతుందని వివరిస్తున్నారు. హార్డ్‌ వేర్, సాఫ్ట్‌వేర్‌ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్‌ తలెత్తుతుంటాయని తెలిపారు.

మరోవైపు ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్‌ సైతం స్పందించింది. విండోస్‌ లో చేపట్టిన క్రౌడ్‌ స్ట్రైక్‌ అప్‌ డేట్‌ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు వెల్లడించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభమన్నారు. సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు.

కాగా ఈ సమస్య పరిష్కారానికి సిస్టమ్‌ ను సేఫ్‌ మోడ్‌ లేదా రికవరీ మోడ్‌ లో ఓపెన్‌ చేయాలి అని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. తర్వాత C:-Windows-System32-drivers-CrowdStrike అనే డైరెక్టరీలోకి వెళ్లాలని పేర్కొంది. అందులో Cn00000291*./~ys అనే ఫైల్‌ ఉంటే డిలీట్‌ చేయాలని తెలిపింది. తర్వాత యథావిధిగా సిస్టమ్‌ను రీబూట్‌ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని వివరించింది.