Begin typing your search above and press return to search.

పీటీఈ కొట్టాడు.. పిల్లాడు సూసైడ్.. హైదరాబాద్ లో విషాదం

బోడుప్పల్ కు చెందిన ధర్మారెడ్డి.. సంగీత దంపతులకు రెండో కుమారుడు 13 ఏళ్ల సంగారెడ్డి. ఉప్పల్ న్యూభరత్ నగర్ లోని ఒక స్కూల్లో చదువుతున్నాడు.

By:  Tupaki Desk   |   23 Feb 2025 5:01 AM GMT
పీటీఈ కొట్టాడు.. పిల్లాడు సూసైడ్.. హైదరాబాద్ లో విషాదం
X

కాలం మారుతోంది. తరం మారుతోంది. ఈ జనరేషన్ పిల్లల్ని ఎలా డీల్ చేయాలన్నది లక్షలాది మంది తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న. గతంలో మాదిరి అదిలించి.. బెదిరించి.. భయపెట్టి.. కాదంతే కొట్టి మరీ పిల్లల్ని దారికి తీసుకొచ్చే రోజులు పోయాయి. ఇప్పటి తరానికి తగ్గట్లుగా వారిని డీల్ చేయాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర విషాదానికి కారణమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిణామమే తాజాగా హైదరాబాద్ లోని బోడుప్పల్ లో చోటు చేసుకుంది.

తాను ఏదో తప్పు చేశానంటూ క్లాస్ రూంలో అందరి ముందు తనను పీఈటీ సార్ కొట్టటాన్ని అవమానంగా భావించిన ఎనిమిదో తరగతి పిల్లాడు సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఇంత చిన్న విషయానికి ఎనిమిదో క్లాస్ పిల్లాడు ఆత్మహత్య చేసుకోవటమా? అంటూ అవాక్కు అవుతున్నారు. తల్లికి రాసిన సూసైడ్ నోట్ లో ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అంటూ నోట్ బుక్ లో రాసుకున్నాడు.

బోడుప్పల్ కు చెందిన ధర్మారెడ్డి.. సంగీత దంపతులకు రెండో కుమారుడు 13 ఏళ్ల సంగారెడ్డి. ఉప్పల్ న్యూభరత్ నగర్ లోని ఒక స్కూల్లో చదువుతున్నాడు. శనివారం స్కూల్ పీఈటీ ఆంజనేయులు ఎనిమిదో క్లాస్ కు వచ్చాడు. శుక్రవారం క్లాస్ రూంలో సీసీ కెమెరా డైరెక్షన్ మార్చిన ఉదంతంలో సంగారెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందరి ముందు బాలుడ్ని కొట్టాడు. ఇలాంటి పనులు మరోసారి చేస్తే.. టీసీ ఇస్తాంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. సంగారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

కాసేపు క్లాస్ రూంలోనే ఏడ్చిన ఈ విద్యార్థి.. వాష్ రూంకు వెళతానని క్లాస్ టీచరుకు చెప్పి బయటకు వెళ్లాడు. సంగారెడ్డి పక్కనే కూర్చున్న మరో విద్యార్థి.. అతగాడు రాసిన నోట్స్ లో ఉన్న సూసైడ్ నోట్ ను గుర్తించి.. క్లాస్ టీచర్ కు చూపించాడు. వెంటనే.. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ కు సమాచారం ఇచ్చేలోపే.. సంగారెడ్డి స్కూల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద శబ్దం రావటంతో పరుగులు తీసిన పాఠశాల సిబ్బంది జరిగిన పరిణామాన్ని చూసి షాక్ తిన్నారు. రక్తపుమడుగులో ఉన్న సంగారెడ్డి అక్కడికక్కడే మరణించాడు. దీనిపై స్పందించిన విద్యాశాఖాధికారులు స్కూల్ ను సీజ్ చేశారు.