కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వివాదాస్పద నేత మల్లన్నపై వేటు
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
By: Tupaki Desk | 1 March 2025 8:28 AM GMTతెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కులగణనతో పాటు ఓ వర్గంపై ఆయన చేసిన విమర్శలపై వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల 5న పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులిచ్చింది. అయితే ఆయన ఆ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడాన్ని సీరియస్ గా పరిగణించిన పార్టీ ఎమ్మెల్సీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
గత ఏడాది కాంగ్రెస్ తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న తొలి నుంచి వివాదాస్పద వైఖరి ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీ ఓట్లతో గెలిచి పార్టీనే ధిక్కరించేలా ఆయన మాట్లాడుతుండటంపై కార్యకర్తల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ప్రభుత్వ విధానాలపై పలు మార్లు బహిరంగంగా ఆయన వ్యాఖ్యానించడం కూడా చర్చకు తావిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినిపించాయి.
ఇదే క్రమంలో గత నెలలో వరంగల్ లో నిర్వహించిన బీసీ గర్జన సభలో ఎమ్మెల్సీ మల్లన్న ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణకు ఆఖరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపైనా విమర్శలకు దిగారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రెడ్డి సంఘం డీజీపీకి ఫిర్యాదు చేసింది. అదేక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపైనా ఎమ్మెల్సీ మల్లన్న విమర్శలు చేశారు.
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా కులగణన చేయాలని చెబుతుండగా, పార్టీ ఎమ్మెల్సీ మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడటంపై పార్టీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన నుంచి వివరణ తీసుకోవాలని హైకమాండ్ క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 5న మల్లన్న షోకాజ్ నోటీసు జారీ చేశారు. 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించారు. కానీ, పార్టీ నోటీసులపై మల్లన్న స్పందించకపోవడంతో సస్పెండ్ చేశారు.