Begin typing your search above and press return to search.

సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మరోసారి విమర్శలు!

కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినా ప్రభుత్వంపైనా, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపైన విమర్శలు చేయడంలో వెనక్కు తగ్గడం లేదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.

By:  Tupaki Desk   |   5 Feb 2025 5:40 AM GMT
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మరోసారి విమర్శలు!
X

సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విమర్శలు గుప్పించారు. కుల గణన నివేదికగా సరిగా లేదని వ్యాఖ్యానించారు. బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆరోపణలతో అగ్గి రాజేశారు. ఇటీవల వరంగల్ లో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరిలో అగ్రవర్ణాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్లన్న.. తన జోరుకు కొనసాగింపుగా ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయడం చర్చకు దారితీస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినా ప్రభుత్వంపైనా, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపైన విమర్శలు చేయడంలో వెనక్కు తగ్గడం లేదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం అంటూ బీసీ యుద్ధభేరిలో వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ.. అదే జోరు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని అభిప్రాయపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనకు చేతులు దులిపేసిందని ఆరోపించారు.

కాగా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తున్నాయి. తమ మద్దతుతో గెలిచి తమపైనే తిరుగుబాటు చేయడమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ కు లేఖలు రాస్తున్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ విషయంలో బహిరంగంగా స్పందించారు. తమ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీ మల్లన్న తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. తమ మద్దతు కోరినప్పుడు మేము రెడ్లమన్న విషయం తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఏదైనా కాంగ్రెస్ మార్కు రాజకీయంతో మల్లన్న రాష్ట్రంలో కేంద్ర బిందువుగా మారుతున్నారు.