Begin typing your search above and press return to search.

నాగార్జునపై నిన్న సురేఖ, నేడు తీన్మార్‌ మల్లన్న!

ఈ నేపథ్యంలో కొండా సురేఖకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మద్దతు తెలిపారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 8:28 AM GMT
నాగార్జునపై నిన్న సురేఖ, నేడు తీన్మార్‌ మల్లన్న!
X

ప్రముఖ సినీ న టుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై, సినీ నటి సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్క నటుడు చిన్నా పెద్ద తేడా లేకుండా స్పందించారు. కుష్బూ వంటి ఇతర భాషా నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం బహిరంగంగానే కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు.

ఈ నేపథ్యంలో కొండా సురేఖకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నాగార్జునపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బీసీ మహిళా మంత్రి కాబట్టి కొండా సురేఖపై నాగార్జున కాలు దువ్వుతున్నాడని మల్లన్న ఫైర్‌ అయ్యారు. ఆయన సంగతేంటో చూస్తామని హెచ్చరించారు.

నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ను కబ్జా చేసి కడితే అందరూ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. నాగార్జున నువ్వు తప్పు చేస్తున్నావు.. నువ్వు హీరోవి కాదు.. విలన్‌ వి అని ఎందుకు నిలదీయలేదని తీన్మార్‌ మల్లన్న ప్రశ్నించారు.

తెలంగాణలో ఒకే ఒక్క బీసీ మహిళ ఉంటే ఆమెపై కాలు దువ్వుతున్నారని.. దువ్వు చూస్తామని హెచ్చరించారు. కొండా సురేఖను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అది కూడా చూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో నాగార్జునపై తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమకు తోచినరీతిలో స్పందిస్తున్నారు.

మరోవైపు కొండా సురేఖపై నాగార్జున నాంపల్లి కోర్టులో వేసిన పరువు నష్టం కేసులో విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందును విచారణను అక్టోబర్‌ 7కి వాయిదా వేసింది.

దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలు కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతోనే నిరాధార ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలతో తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయని నాగార్జున పిటిషన్‌ లో పేర్కొన్నారు.