Begin typing your search above and press return to search.

మల్లన్న మళ్లీ 'తీన్మార్' వేసేశాడు.. ఈసారి దేనీ మీదంటే?

పలు ప్రయత్నాల తర్వాత ఎమ్మెల్సీగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచి మూడు నెలలు కూడా కాకముందే ఆయన తనదైన శైలిలో వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 12:06 PM GMT
మల్లన్న మళ్లీ తీన్మార్ వేసేశాడు.. ఈసారి దేనీ మీదంటే?
X

తెలంగాణకు ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.. 2028లో కాబోయే సీఎం బీసీ కులాలకు చెందిన నాయకుడే.. బీసీల కోసం ఎంత దూరమైనా వెళ్తా.. మహా అయితే ఎమ్మెల్సీ పదవి పోతుంది. మళ్లీ టీవీల ముందు కూర్చుంటా..ఈ మాటలన్నది ఎవరో చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో అధికార పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకత్వాన్నే ప్రశ్నించేలా మాట్లాడుతున్నారు తీన్మార్ మల్లన్న. మరి ఆయన వెనుక ఎవరున్నారో తెలియదు కానీ.. మల్లన్న మాత్రం తన వ్యాఖ్యలతో తీన్మార్ ఆడేస్తున్నారు. పలు ప్రయత్నాల తర్వాత ఎమ్మెల్సీగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచి మూడు నెలలు కూడా కాకముందే ఆయన తనదైన శైలిలో వెళ్తున్నారు.

బీసీ నాయకుడిగా ఎదగాలనా?

కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటికాలి మీద లేచి తీవ్ర విమర్శలతో బీఆర్ఎస్ ఓటమిలో పాలుపంచుకున్న మల్లన్న.. సొంత ఆలోచన కలిగిన వ్యక్తి. బీసీ మున్నూరు కాపు కులానికి చెందిన మల్లన్న గతంలో జర్నలిస్టు. తర్వాత సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టారు. పత్రికనూ స్థాపించారు. కాగా, మార్నింగ్ న్యూస్ తో ఆయన బాగా పాపులర్ అయ్యారు. అందులో కేసీఆర్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టేవారు. దీంతో మల్లన్నపై 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒకదాని మీద ఒకటి కేసులతో జైల్లో పెట్టారు. రాజకీయంగా అండ కోసం బీజేపీలో చేరినా.. అక్కడ ఇమడలేకపోయారు. సొంతంగా పార్టీనీ నెలకొల్పారు. తర్వాత కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఎమ్మెల్సీగా ఆ పార్టీ తరఫునే ఎన్నికయ్యారు. అయినా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. బీసీల హక్కుల గురించి గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మల్లన్న బీసీ నాయకుడిగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది.

ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చా?

అసెంబ్లీనే కాదు.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాక వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుక వీలు లేదనే నిబంధన ఉంది. కానీ, తీన్మార్ మల్లన్న మాత్రం ఎందరు పిల్లలున్నా పోటీచేసేందుకు అర్హులే అని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పాత నిబంధనను తీసివేసిందన్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇది వర్తిస్తుందన్నారు. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మల్లన్న మాత్రం సొంతంగా ప్రకటన చేసేయడం గమనార్హం. మరి సర్కారు ఏమంటుందో?

అసలు విషయం ఇది: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. దీనికి గాను కుల గణన జరగాలని ప్రభుత్వం అంటోంది. బీసీ సంఘాలు, నాయకులు మాత్రం రిజర్వేషన్ మార్గదర్శకాల విడుదలకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సంతానం నిబంధనపై మల్లన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.