Begin typing your search above and press return to search.

నాకు వాళ్ల ఓట్లు అక్కర్లేదు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్. ఆయన నవీన్ కన్నా తీన్మార్ మల్లన్న గానే ఫేమస్.

By:  Tupaki Desk   |   28 Sep 2024 10:59 AM GMT
నాకు వాళ్ల ఓట్లు అక్కర్లేదు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
X

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్. ఆయన నవీన్ కన్నా తీన్మార్ మల్లన్న గానే ఫేమస్. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చాలా మందికి సుపరిచితం ఆయన. సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరును నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటారు. విశ్లేషణలు ఇస్తుంటారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న చేసిన యుద్ధం అంతాఇంతా కాదు. ఆ ప్రభుత్వం అవలంబించిన విధానాలపై ఏ రోజుకారోజు నిలదీస్తూనే ఉండేవారు. ఆ ప్రభుత్వం దిగిపోవాలంటూ పోరాటాలు చేశారు. తన చానల్ ద్వారా నిత్యం ప్రశ్నించే వారు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ట్రెండ్ సృష్టించారు. అలాగే.. గత ప్రభుత్వానికి నిద్ర లేకుండానూ చేశారు. గత ప్రభుత్వంలోని కేసీఆర్, కేటీఆర్ తదితర నేతలను టార్గెట్ చేసి ఆయన వేసిన ప్రశ్నలు కింది స్థాయి ప్రజల వరకూ చేరాయి. అధికార పార్టీనే ప్రధాన టార్గెట్‌గా ప్రజా సమస్యలే లక్ష్యంగా ఆయన తన చానల్‌లో డిబేట్లు కొనసాగించారు.

అయితే.. తీన్మార్ మల్లన్న ముందు నుంచి సెన్సేషనలే అని చెప్పాలి. గత ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యతిరేక దాడికి ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు. మరెన్నో పోలీసుల వేధింపులు భరించారు. అరెస్టులూ తప్పలేదు. కొన్ని రోజులు జైలు జీవితమూ తప్పలేదు. అలా కొనసాగిన ఆయన ప్రస్థానం మధ్యలో బీజేపీలో చేరారు. వివిధ కారణాలతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఆ తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మండలిలోకి అడుగుపెట్టారు.

ఇక అప్పటి నుంచి గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉన్నారు. అయితే సంచలనాలకు కేరాఫ్ అయినా ఎప్పుడు ఏది మాట్లాడినా సెన్సేషనలే అవుతుంటుంది. ఇటీవల బీసీ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఒకవేళ పోటీలో నిలిస్తే రెడ్డిలు, ఓసీలు తనకు ఓట్లు వేయొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కులాల వారి ఓట్లు తనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. బీసీల ఓట్లే తనకు సరిపోతాయని, గెలుపునకు సరిపోగా ఇంకా మిగులుతాయని అన్నారు. అలాగే.. తెలంగాణకు రెడ్డి సీఎం రేవంత్ రేడ్డే ఆఖరు అని.. వచ్చే 2028 నాటి ఎన్నికల్లో బీసీనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు. దాంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.