Begin typing your search above and press return to search.

డ్రామాలు చూశారని 30 మంది ఉరి... ఎక్కడో మీకు తెలుసు!?

అవి చదివినవారికే షాకింగ్ గా ఉండగా... ఇక అక్కడున్న ప్రజల పరిస్థితి ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   15 July 2024 6:11 AM GMT
డ్రామాలు చూశారని 30 మంది ఉరి... ఎక్కడో మీకు తెలుసు!?
X

ఈ శీర్షిక చూడగానే పాఠకులకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇది కచ్చితంగా కిమ్ జోంగ్ వ్యవహారమని.. ఉత్తర కొరియా ప్రజల దౌర్భాగ్యమని! అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనలు కోకొల్లలు అయినప్పటికీ.. కొన్ని మాత్రమే బయట ప్రపంచంలోకి వస్తుంటాయి. అవి చదివినవారికే షాకింగ్ గా ఉండగా... ఇక అక్కడున్న ప్రజల పరిస్థితి ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అవును... దక్షిణ కొరియా డ్రామాలు వీక్షించారని ఆరోపిస్తూ ఉత్తర కొరియాలో సుమారు 30 మందికీ బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారని తెలుస్తోంది. ఇందులోభాగంగా వారిని ఉరి తీశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... జీవితంలో ఎలాంటి వినోదమూ లేకుండా ఇలా నిస్సారంగా బతకడం కంటే చావు మేలంటూ ఉత్తర కొరియా యువత బహిరంగంగానే చెబుతూ చట్టాలను ధిక్కరిస్తోందనే కథనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు తరచూ ప్రజల మొబైల్స్‌ ను తనిఖీ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారట. ఉత్తర కొరియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయనేది తెలిసిన విషయమే. పెట్టుబడిదారీ ఫ్యాషన్ పోకడల పేరుచెప్పి అక్కడ జీన్స్ ధరించడం కూడా నిషేధం. అసలు అక్కడ ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ హెయిర్ స్టైల్ చేసుకొవాలి అనేది కూడా అక్కడ కిమ్ నిర్ణయిస్తారు!

ఇదేసమయంలో... హెయిర్ స్టైల్, విదేశీ భాషలు ఉన్న టీషర్టులు ధరించడం, జుట్టుకు సంప్రదాయేతర రంగులు పూసుకోవడం, సన్ గ్లాసెస్ ధరించడం, మద్యం తాగేందుకు వైన్ గ్లాస్‌ లను ఉపయోగించడం వంటివి అక్కడ తీవ్రమైన నేరాలు. వాస్తవానికి ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య దశాబ్దాలుగా నిశ్శబ్ద వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా దక్షిణ కొరియాను తమ శత్రువులలో ఒకటిగా ప్రకటించారు. ఉత్తర కొరియాలో టీవీ షోలు, డ్రామాలతో సహా దక్షిణ కొరియాలోని ఏదైనా కంటెంట్‌ ని చూడటం చట్టవిరుద్ధం. ఉత్తర కొరియాలోని ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లలో కే-డ్రామాలు అందుబాటులో లేనప్పటికీ, దేశంలోకి అక్రమంగా రవాణా చేయబడిన యూ.ఎస్.బీ. డ్రైవ్‌ లలో చాలా మంది వ్యక్తులు వాటిని చూస్తున్నారని నివేదించబడింది.

ఈ నేపథ్యంలోనే కొరియా డ్రామాలు వీక్షించినందుకు 30 మంది యువకులను ఉత్తర కొరియా ఉరితీసిందని, వారి సమాచారం ధృవీకరించబడిందని పేర్కొంటూ ప్రముఖ మీడియా సంస్థలు నివేదించాయి. ఈ సంఘటనపై గార్డియన్ నివేదించింది.. ఉత్తర కొరియాలోని మానవ హక్కుల గురించి తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.