Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు దంతాల సర్జరీకెళ్తే.. ప్రాణమే పోయింది

మిర్యాలగూడకు చెందిన రాములు, సరస్వతి దంపతులు హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 7:14 AM GMT
పెళ్లికి ముందు దంతాల సర్జరీకెళ్తే.. ప్రాణమే పోయింది
X

దీనిని విధి వైచిత్రి అనాలో..? లేక అతడి బ్యాడ్ లక్ అనాలో..? వ్యాపారంలో స్థిరపడ్డాడు.. ఇక జీవితంలోనూ స్థిరపడడమే మిగిలింది.. అందులోభాగంగా పెళ్లి కుదిరింది.. కానీ, నిశ్చితార్థం అయిన మరునాడే ఘోరం జరిగింది. చిన్న సర్జరీకి వెళ్లిన అతడి ప్రాణమే పోయింది. ఇదంతా హైదరాబాద్ లో జరిగింది. నగరంలో కొన్నేళ్ల కిందట ఎత్తుగా కనిపించేందుకు వెళ్లి ఓ యువకుడు సర్జరీ చేయించుకుని ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. ఇలాంటిదే తాజా ఘటన కూడా.

మిర్యాలగూడకు చెందిన రాములు, సరస్వతి దంపతులు హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉంటున్నారు. వీరికి కుమారుడు లక్ష్మీనారాయణ, ఇద్దరు కుమార్తెలున్నారు. లక్ష్మీనారాయణ డిగ్రీ చదివి వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 15న అతడికి నిశ్చితార్థం జరిగింది. అయితే, కింది పళ్ల వరుసను సరిచేయించుకునేందుకు 16వ తేదీన మధ్యాహ్నం అతడు ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ, సాయంత్రానికి కూడా తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. అవతల లక్ష్మీనారాయణ కాకుండా మరెవరో లిఫ్ట్ చేశారు.

అసలేం జరిగింది..? సీసీ టీవీతో వెలుగులోకి

నిశ్చితార్థం జరిగిన సంతోషకర సందర్భంలొ ఉండగా.. కుమారుడు మరణించాడన్న దుర్వార్త తెలిసి తల్లిదండ్రులు, సోదరుడు ఇక లేడన్న విషయం తెలిసి సోదరీమణులు హతాశులయ్యారు. లక్ష్మీనారాయణ తండ్రి రాములు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుం అనంతరం పోలీసులు కూపీ లాగగా.. అసలు విషయం బయటపడింది. డెంటల్ ఆస్పత్రిలోని సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం చూడగా.. లక్ష్మీనారాయణకు వైద్యులు మత్తుమందు (అనస్తీషియా) ఇచ్చి లేజర్ చికిత్స చేశారు. ఆ తర్వాత అతడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. రెండుమూడు సార్లు వాంతులు చేసుకున్నాడు. వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చాక కడుపు నొప్పితో కిందపడిపోయాడు. ఫిట్స్ రావడంతో ఆస్పత్రి సిబ్బంది అతడి చేతిలో తాళం చెవులు పెట్టారు. అంబులెన్స్ ను పిలిచి అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, తమ వద్దకు వచ్చేలోపే లక్ష్మీనారాయణ చనిపోయాడని అపోలో వర్గాలు తెలిపాయి. ఎఫ్ఎంఎస్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం కారణంగానే తన కుమారుడు చనిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి రాములు వాపోయాడు. ఈ మొత్తం ఘటనపై ఆస్పత్రి వర్గాల స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.