కారులో గ్యాస్ లీక్... అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి!
ఇటీవల కాలంలో విదేశాల్లో.. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నత విధ్యనభ్యాసిస్తున్న పలువురు భారతీయ విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Dec 2023 9:27 AM GMTఇటీవల కాలంలో విదేశాల్లో.. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నత విధ్యనభ్యాసిస్తున్న పలువురు భారతీయ విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇవి తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. వీటిలో రోడ్డు ప్రమాదాలు, భౌతిక దాడులు, మొదలైనవి ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో యూఎస్ లో ఒక తెలుగు విద్యార్థిని మృత్యువాత పడ్డారు.
అవును... ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. అక్కడ కారులో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా గ్యాస్ లీక్ అవ్వడంతో కారు డ్రైవర్ తో పాటు ఆమెకూడ మృత్యువాత పడ్డారు. దీంతో ఆంధ్రాలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వివరాళ్లోకి వెళ్తే... విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) నగరంలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లాలనుకున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ ఇన్ ఫిజియోథెరపీ కోర్సు చేయడం కోసం అమెరికాలోని షికాగోకు వెళ్లారు!
ఈ క్రమంలో... తాజాగా ఆమె కారులో ప్రయాణిస్తుండగా ఉన్నపలంగా గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ తో పాటు షేక్ జహీరా నాజ్ కూడా స్పృహ తప్పిపోయారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే... అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
దీంతో ఈ విషయాన్ని జహీరా నాజ్ స్నేహితులు.. విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లిన తమ కూతురు అర్ధాంతరంగా ఇలా చనిపోతుందని ఊహించలేకపోయామంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ సమయలో తమ కుమార్తె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రసాదంపాడులో విషాద చాయలు అలముకున్నాయి. ఈమె మృతికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ రావాల్సి ఉంది.