Begin typing your search above and press return to search.

నేనూ క్రికెటర్ నే.. కోహ్లికి కెప్టెన్ ను.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆర్జేడీ నాయకుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   16 Sep 2024 5:30 PM GMT
నేనూ క్రికెటర్ నే.. కోహ్లికి కెప్టెన్ ను.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
X

కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆర్జేడీ నాయకుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాను క్రికెట్ ఆడిన విషయాన్ని చెబుతూ.. కీలక సంగతిని వెల్లడించారు. 17 ఏళ్ల కిందట ఢిల్లీకి ఆడిన తేజస్వీ.. ఆ తర్వాత ముందుకెళ్లలేకపోయారు. ఇప్పుడు అవన్నీ తలచుకుంటూ ఓ ట్వీచ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, 2020లో జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆర్జేజీని దాదాపు గెలిపించినంత పనిచేశారు తేజస్వీ. ఆయన వేవ్ తీవ్రంగా ఉండింది. అయితే, కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వడం ఆ పార్టీ వాటిలో ఓడిపోవడంతో సీఎం కాలేకపోయారు. ఇక తర్వాత జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ కలిసిరావడంతో సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. నీతీశ్ మళ్లీ బీజేపీతో కలవడంతో తేజస్వీ ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. ఇండియా కూటమిలో ఇప్పుడు తేజస్వీ ప్రధాన నాయకులలో ఒకరు.

అప్పట్లో ఢిల్లీకి ఆడుతూ.

34 ఏళ్ల తేజస్వీ బిహార్ కు చెందినవారు అయినా.. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఎక్కువగా ఉండేవారు. 2004-09 మధ్యన లాలూ యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ బాధ్యతలు చూసిన సంగతి తెలిసిందే. అప్పటికి 14-19 ఏళ్ల కుర్రాడైన తేజస్వీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించారు. కాగా, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లికి సమ వయస్కుడైన తేజస్వీ ఆ సందర్భాన్ని తలచుకుంటూ పోస్ట్ చేశారు. ‘‘ఒకప్పుడు నేనూ క్రికెటర్ నే. దేశవాళీల్లో విరాట్‌ కోహ్లి నా సారథ్యంలో ఆడాడు’’ అని చెప్పుకొచ్చాడు. ‘కోహ్లినే కాదు ఇప్పుడు టీమ్ ఇండియాలో ఉన్న చాలామంది నా సహచరులే’ అని పేర్కొన్నాడు. కోహ్లిది ఢిల్లీ అనే సంగతి తెలిసిందే. తేజస్వీ కూడా 2004-09 సమయంలో ఢిల్లీకే ఆడాడు. ఆ సమయంలోనే కెప్టెన్ గా చేశాడు. కొంతకాలం విరాట్‌ తో కలిసి ఆడాడు.

ప్రతిభ కంటే పైరవీ ద్వారానే?

తేజస్వీ సాధారణ క్రికెటర్ అనేది చాలామంది విమర్శ. కేవలం రాజకీయ పలుకుబడితోనే ఆయన రంజీ స్థాయికి వచ్చారనే ఆరోపణలు చేశారు. అండర్ 19 స్థాయిలో ఢిల్లీకి ఆడినా.. రంజీల్లో సొంత రాష్ట్రం బిహార్ కు కాకుండా జార్ఖండ్ కు ప్రాతినిధ్యం వహించారు. 2009 నవబంరులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ లో అడుగుపెట్టి విదర్భతో తొలి మ్యాచ్ ఆడారు. ఫిబ్రవరి 2010లో మొదటి లిస్ట్ ఏ మ్యాచ్‌ ను త్రిపుర, ఒడిసాతో ఆడాడు. ఒరిస్సా, అస్సాం, బెంగాల్, త్రిపుర తో నాలుగు టీ20ల్లో పాల్గొన్నారు. అయితే, క్రికెటర్ గా కంటే తనను రాజకీయ నాయకుడిగానే ఎక్కువగా గుర్తిస్తున్నారంటూ వాపోతున్నారు. తాను మంచి క్రికెట్ ఆడినట్లు చెప్పుకొంటున్నారు. రెండు కాళ్లకు గాయాలు కావడంతోనే క్రికెట్ నుంచి తప్పుకొన్నట్లు పేర్కొన్నారు. తేజస్వీ.. 2008-2012 మధ్య ఐపీఎల్ లో ఢిల్లీ ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఢిల్లీ కేపిటల్స్) జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌ లోనూ ఆడే అవకాశం రాలేదు.