టీడీపీ బిగ్ షాట్ కి హ్యాట్రిక్ ఖాయమేనా ?
తెలుగుదేశం పార్టీకి కొన్ని సీట్లు గన్ షాట్ గా గెలుచుకునేవి ఏపీలో ఉన్నాయి. ఆ సీట్లు కళ్ళు మూసుకుని గెలుచుకుంటుంది
By: Tupaki Desk | 23 April 2024 3:00 AM GMTతెలుగుదేశం పార్టీకి కొన్ని సీట్లు గన్ షాట్ గా గెలుచుకునేవి ఏపీలో ఉన్నాయి. ఆ సీట్లు కళ్ళు మూసుకుని గెలుచుకుంటుంది. అలాంటి సీట్లను గెలుచుకోవాలని వైసీపీ చాలా కసరత్తు చేస్తోంది. కానీ సీరియస్ గా చేసిందా అంటే కొన్ని సీట్లను చూస్తే మాత్రం డౌట్లు వస్తాయి.
ఉత్తరాంధ్రా టీడీపీ బిగ్ షాట్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయిన అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి సీటు వైసీపీకి ఈసారి అయినా దక్కుతుందా అన్న ఆశలను ఆవిరి చేసేలా అక్కడ పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. టెక్కలిలో చూస్తే వైసీపీకి సామాజిక వర్గాల పరంగా బలమైన మద్దతు ఉంది.
కానీ వైసీపీ లో భీకరమైన వర్గ పోరు. ఆ పోరు కూడా 2014 నుంచి 2019 దాకా అక్కడ నుంచి 2024 దాకా అలా కొనసాగుతూనే వస్తోంది. వైసీపీ ప్రభుత్వం లోకి వచ్చాక కూడా సెట్ చేసుకోలేకపోయింది. కనీసం కొందరిని అయినా పార్టీలో ఉంచుకోలేకపోయింది.
దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎందుకో వైసీపీ అధినాయకత్వానికి బాగా ఇష్టం అని అంటూంటారు. ఆయన కింజరాపు ఫ్యామిలీ మీద దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. వారికి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో కూడా ఆయన అంత యాంటీ ఎవరూ ఉండరు. వైసీపీలో సైతం కింజరాపు మిత్రులు ఉన్నారని చెబుతారు. అంతకు ముందు కాంగ్రెస్ లోనూ ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా కింజరాపుకు హెల్ప్ చేసే వర్గాలు శ్రీకాకుళంలో ఉండేవి అని ప్రచారంలో ఉండేది.
ఇక ఈ కీలక సమయంలో కింజరాపు ఫ్యామిలీని ఎదురొడ్డి నిలిచి గెలవాలని ఉన్న దువ్వాడ శ్రీనివాస్ లో ఆవేశం పాళ్ళు ఎక్కువ. వ్యూహాలు కూడా అనుకున్న తీరున ఆయన అమలు చేయలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన జగన్ అంటే వీరాభిమానం చూపిస్తారు. దాంతో జగన్ ఆయనకు పెద్ద పీట వేస్తూ ఉంటారు. వైసీపీలో రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్, ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఇలా దువ్వాడను అచ్చెన్నాయుడు మీద ఆయుధంగా జగన్ ప్రయోగిస్తున్నారు. కానీ బిగ్ వాయిస్ తో దూకుడు రాజకీయం చేయడమే దువ్వాడకు తెలుసు. అదే సమయంలో తన వెంట పార్టీ నేతలను ఆయన ఉచుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన సొంత ఇంటినే చక్కదిద్దుకోలేకపోయారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఆయన వైఖరి నచ్చక సొంత సోదరుడు పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇక ఆయన సతీమణి దువ్వాడ వాణి అయితే భర్తకు వ్యతిరేకంగా రెబెల్ గా పోటీ టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించారు అని అంటున్నారు. టెక్కలి నుంచి మరో బలమైన నేత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అయితే ఏకంగా వైసీపీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు.
ఇవన్నీ ఎన్నికల ముందు టెక్కలిలో సంభవించిన పరిణామాలు. టెక్కలిలో సామాజికవర్గాల పరంగా చూస్తే బలమైన కాళింగ సామాజికవర్గం వైసీపీ వైపు చూస్తోంది. టెక్కలి తమ సొంత సీటు అని ఆ సామాజిక వర్గం భావిస్తోంది. కానీ గత కొన్ని ఎన్నికలుగా ఆ సామజికవర్గం అక్కడ నుంచి గెలిచి జెండా ఎగర వేయలేకపోతోంది.2004 తరువాత కాళింగులకు టెక్కలి ఎమ్మెల్యే సీటు దక్కలేదు.
ఇక 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ వల్ల టెక్కలిలో కింజరాపు వారి సొంత సీటు హరిచంద్రపురంలో చాలా భాగం కలసింది. అలా సంతబొమ్మాళి వంటి అతి పెద్ద మండలం ఈ వైపుగా వచ్చింది. ఆ మండలంలోనే ఉన్న కింజరాపు సొంత ఊరు నిమ్మాడ నుంచి టెక్కలి వైపుగా కింజరాపు కుటుంబం టర్న్ అయింది.
టీడీపీ అయితే వెలమ సామాజిక వర్గానికే టెక్కలి టికెట్ ని ఇస్తూ వస్తోంది. గత మూడు ఎన్నికల నుంచి వైసీపీ కాళింగులకు టికెట్ స్తోంది. కానీ వర్గ పోరు వల్ల టెక్కలి సీటులో కాళింగులు గెలవలేకపోతున్నారు. ఈసారి అయినా దువ్వాడ శ్రీనివాస్ గెలుస్తారు అనుకుంటే ఆయనకు సొంత పార్టీలోనూ సొంత ఇంటిలోనూ పోరు ఎక్కువ అయింది అని అంటున్నారు. దాంతో అచ్చెన్నాయుడుకు ఎన్నికల కంటే ముందే గెలుపు ధీమాతో పాటు భారీ మెజారిటీ ఆశలు కూడా పెరిగాయని అంటున్నారు.
నిజానికి రెండు సార్లు గెలిచిన అచ్చెన్నాయుడు మీద ఈసారి వ్యతిరేకత బాగానే ఉంది. ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే విషయంలో మాత్రం వైసీపీ పూర్తిగా విఫలం అవుతోంది. ఇదిలా ఉంటే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభను టెక్కలిలోనే జగన్ ఏర్పాటు చేశారు. ఈసారి అచ్చెన్నను మాజీ చేయాలన్నది జగన్ పంతం. ఆ దిశగా ఆయన పార్టీని ఏ విధంగా సమాయత్తం చేస్తారో చూడాల్సి ఉంది అంటున్నారు.