Begin typing your search above and press return to search.

ఆయన లేకుండానే తెలంగాణ ఎన్నికలు..? 40 ఏళ్లలో తొలిసారి

నాటి ఎన్నికల ఫలితం అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 5:04 PM GMT
ఆయన లేకుండానే తెలంగాణ ఎన్నికలు..? 40 ఏళ్లలో తొలిసారి
X

తెలంగాణలో మరొక్క నలభై ఎనిమిది రోజుల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలకూ అత్యంత కీలకం. ఎందుకంటే.. తెలంగాణలో మూడోసారీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ చూస్తుండగా, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి రెండుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక తామే గెలుస్తున్నామంటూ బీజేపీ ఊదరగొడుతోంది. ఎవరికి ఫలితం అనుకూలంగా వస్తుందో తెలియాలంటే డిసెంబరు 3 వరకు ఆగాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడో కీలక పరిణామం... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 40 ఏళ్లలో తొలిసారిగా ఆయన లేకుండా జరుగుతుండడం. అందులోనూ ఆయనేమీ సాదాసీదా వ్యక్తి కాదు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రనే మార్చిన వ్యక్తి. విభజన జరిగిపోయినా, ఆయన ప్రభావం తెలంగాణపై తీసిపారేయదగినది కాదు. కానీ, అనూహ్యంగా ఆయన లేకుండానే ఈ సారి తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి.

బయటకు వచ్చేది ఎప్పుడు..?

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, విభజిత ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్ర వరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన లాయర్లు బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి సఫలం కావడం లేదు. ఇప్పటికే నెల పైగా ఆయన జైలులో ఉన్నారు. మరొక నెల రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని.. విశ్లేషణలు వస్తున్నాయి. అంటే నవంబరు మధ్య వరకైనా చంద్రబాబు జైలు నుంచి రారనే అర్థంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం వచ్చేసింది. నాలుగు రోజుల కిందటే షెడ్యూల్ వచ్చింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలు నవంబరు 10తో ముగియనుంది. ఆ నెల 13న పరిశీలన,15న ఉప సంహరణ తేదీలు.

అంటే.. నవంబరు అంతా తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉండనుంది. కానీ.. విశ్లేషణల ప్రకారమే చూస్తే చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చేసరికి నవంబరు 15 అవుతోంది. ఆ వెంటనే ఆయన తెలంగాణపై ఫోకస్ పెట్టడం కష్టం. ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ గట్టి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందులోనూ ఏపీలో ఆరు నెలల్లోనే అత్యంత కీలకమైన ఎన్నికలున్నందున బాబు ఫోకస్ అంతా అటే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అంటే.. చంద్రబాబు పూర్తిగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయే అవకాశం ఉంది.

చరిత్రలో తొలిసారి?

టీడీపీ ఆవిర్భావం జరిగిన 1983 నుంచి తెలంగాణ ఆ పార్టీ ప్రభావం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన 2014లో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లోనూ టీడీపీ తన ప్రాధాన్యం చాటింది. అందులోనూ తెలంగాణలో బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీగా టీడీపీకి ఇప్పటికీ పేరుంది. అందుకే గత ఎన్నికల్లోనూ టీడీపీ మహా కూటమి ఏర్పాటును విజయవంతం చేయగలిగింది. కాగా, 1983లో పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్, ఆ తర్వాతి ఎన్నికలన్నిటిలోనూ చంద్రబాబు ప్రచారం చేశారు. ఇఫ్పుడు మాత్రం అందుకు అవకాశం కనిపించడం లేదు. ఓ విధంగా చూస్తే ఇది అనూహ్యమే.

కొసమెరుపు: 2018 ఎన్నికల సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్ తదితర పార్టీలు మహా కూటమిగా ఏర్పడి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)ను ఢీకొన్నాయి. అయినా, హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ నే విజయం వరించింది. నాటి ఎన్నికల ఫలితం అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. అలానే 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ కు సహకరించారనే పేరుంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంగానూ అదే రిటర్న్ గిఫ్ట్ కొనసాగుతోందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.