Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్? జంపింగ్ ఎమ్మెల్యేల యూటర్న్

కోర్టు తీర్పుపై ఆందోళన, మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిరాకపోవడం వల్ల వలస ఎమ్మెల్యేలు అంతా తిరుగుటపాకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 11:37 AM GMT
సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్? జంపింగ్ ఎమ్మెల్యేల యూటర్న్
X

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో సమావేశమైన పది మంది ఎమ్మెల్యేలు.. సుప్రీంకోర్టు నోటీసులు, అసెంబ్లీ సెక్రటరీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. అనర్హత వేటు పడేలా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేయడం, కోర్టు తీర్పుపై ఆందోళన, మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిరాకపోవడం వల్ల వలస ఎమ్మెల్యేలు అంతా తిరుగుటపాకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

13 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలవడం, ఆ తర్వాత కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేతిని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. గతంలో వీరిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు కాలం తీరిపోయినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 10న ఈ పిటిషన్ పై విచారణ జరగనుండటంతో ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోందని అంటున్నారు.

బీఆర్ఎస్ చర్యల వల్ల తమపై అనర్హత వేటు పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఎదుర్కోవడం కష్టమని మెజార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి దానం నాగేందర్ వంటివారు కాంగ్రెస్ పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. తన ఇంట్లో కేసీఆర్ ఫొటో ఉంటే అభ్యంతరమేంటని ఈ మధ్యే ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ ఉందనే ఆలోచనతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. దానం ఇంట్లో సమావేశమైన ఎమ్మెల్యేల్లో కొందరు ఈ ప్రతిపాదన తెచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ మారినా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడరుతో సఖ్యత ఏర్పడకపోవడం, బీఆర్ఎస్ శ్రేణులు శత్రువుల్లా చూడటం వల్ల తాము రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో మళ్లీ గులాబీ కండువాలు కప్పుకునేందుకు సామూహికంగా నిర్ణయం తీసుకుందామని కొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనంటున్నారు. పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం, తనను నమ్మి పార్టీలోకి వచ్చిన పది మందిని కాపాడుకోలేని పరిస్థితి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు చోటుచేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు జంపింగ్ ఎమ్మెల్యేలు తిరుగుటపా ఆలోచనల వల్లే సీఎం అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.