ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్టు కానున్నారా?
ఈ వ్యవహారంలో తాను తప్పే చేయలేదని తేల్చేయటమే కాదు.. ఇదో కేసా? అంటూ కొట్టి పారేస్తున్నారు కేటీఆర్.అయితే.. ఆయన చెప్పినంత తేలికైన కేసుగా మాత్రం చెప్పటం తప్పే అవుతుంది.
By: Tupaki Desk | 6 Jan 2025 5:20 AM GMTఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్న పాత రోజుల నుంచి తోక కూడా లేకుండానే పులిని క్రియేట్ చేయటమే కాదు.. ఆ అంశాన్ని వైరల్ చేసేసి.. ఏదో ఉంది బాస్ అన్న అనుమానాన్ని బలంగా కల్పించే విషయంలో సోషల్ మీడియా పోషిస్తున్న శక్తివంతమైన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలా అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేవన్నీ అబద్ధాలేనా? అంటే కాదనే చెప్పాలి. అయితే.. ఏది నిజం? మరేది అబద్ధం? అన్నది తేల్చటమే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతి పెద్దసవాలుగా చెప్పాలి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఈ అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా ఏసీబీ జారీ చేసిన నోటీసుకు స్పందనగా ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ రోజు (సోమవారం) ఉదయం ఏసీబీ ఎదుట హాజరయ్యే కేటీఆర్ ను.. విచారణ అనంతరం అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనికి సంబంధించిన అవకాశాలు ఎన్ని ఉన్నాయి? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ఈ వ్యవహారంలో తాను తప్పే చేయలేదని తేల్చేయటమే కాదు.. ఇదో కేసా? అంటూ కొట్టి పారేస్తున్నారు కేటీఆర్.అయితే.. ఆయన చెప్పినంత తేలికైన కేసుగా మాత్రం చెప్పటం తప్పే అవుతుంది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కుదుర్చుకున్న ఒప్పందాలు పెద్ద నేరాలు కానప్పటికీ.. విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరపటం.. అందులోనూ మంత్రివర్గం ఆమోదం లేకపోవటం.. రిజర్వు బ్యాంక్ కు సమాచారం ఇవ్వకపోటమే తలనొప్పి అంశాలుగా చెబుతున్నారు.
కేటీఆర్ చెప్పినట్లుగా తనపై చేస్తున్న ఆరోపణల్లో పస లేకుంటే.. విషయం ఇక్కడి దాకా వస్తుందా? విచారణకు ఏసీబీ ఎదుట హాజరయ్యే వరకు వెళుతుందా? అన్నది మరో ప్రశ్న. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. న్యాయపరంగా తమకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టని కల్వకుంట్ల ఫ్యామిలీ.. ఏసీబీ ఎదుట హాజరు కాకుండా ఉండేందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా.. వాటిని వినియోగించకకుండా ఉంటారా? అన్నది మరో మాటగా చెప్పాలి.
తీవ్రచర్చగా మారిన కేటీఆర్ అరెస్టు విషయానికి వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్టు అవకాశాలు చాలా తక్కువగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్టు అయితే.. రేవంత్ సర్కారు బద్నాం కావటం ఖాయమంటున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా రాజకీయ కక్షతోనే అరెస్టు జరిగిందన్న ప్రచారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మటం ఖాయమంటున్నారు. ఈ కేసు విచారణ.. అందులో వెలుగు చూసే అంశాలు ప్రజలకు వెళ్లి.. ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ తప్పు చేసినట్లుగా మెజార్టీ ప్రజలు నమ్మే వరకు.. వారి మైండ్ లో చేసిన తప్పునకు శిక్ష పడాలి కదా? అన్న భావన బలంగా నాటుకునే వరకు కేటీఆర్ అరెస్టు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది.