Begin typing your search above and press return to search.

అప్పులపై భట్టి వర్సెస్ హరీశ్.. ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు..

రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేతికి సంకెళ్లు వేసుకొని సభకు హాజరయ్యారు

By:  Tupaki Desk   |   17 Dec 2024 9:15 AM GMT
అప్పులపై భట్టి వర్సెస్ హరీశ్.. ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు..
X

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేతికి సంకెళ్లు వేసుకొని సభకు హాజరయ్యారు. అలాగే.. బ్లాక్ షర్ట్స్ ధరించి నిరసనకు దిగారు. సభలోనూ అదే షర్ట్‌తో కూర్చున్నారు.

మరోవైపు.. లగచర్ల ఘటనపై అసెంబ్లీ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. రాష్ట్రంలో పర్యాటక విధానాంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘచర్లపై చర్చ ప్రారంభించగానే బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా లేచి ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని నిలదీశారు. దీనికి స్పీకర్ అంగీకరించలేదు. దీంతో ఫ్లకార్డులను ప్రదర్శిస్తూనే నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి నిరసనకు దిగారు.

ఇక.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అప్పుల విషయంలో సభలో మాజీమంత్రి హరీశ్, డిప్యూటీ సీఎం భట్టి అన్నట్లుగా సాగింది. శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాదన జరిగింది.

ముందుగా బీఆర్ఎస్ హరీశ్‌రావు మాట్లాడారు. ఆర్‌బీఐ వివరాల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1.27 లక్షల కోట్లు అప్పులు చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఐదేళ్ల పాలన పూర్తిచేసే సరికి ఈ ప్రభుత్వం చేసిన అప్పు రూ.6.36 లక్షలకు చేరుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మా ప్రభుత్వం హయాంలో రూ.4,17,496 కోట్ల అప్పు చేస్తే.. రూ.7 లక్షల కోట్ల పైచిలుకు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అప్పుల అంశంపై సభలో ప్రత్యేక చర్చ పెట్టాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హామీల అమలు తమకు పెద్ద సమస్య కాదన్న భట్టి.. ఇప్పుడు అప్పుల పేరు చెప్పి వాటి అమలును తప్పించుకుంటున్నారని ఆరోపించారు.

దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీటుగా బదులిచ్చారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే సభలో శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెప్పారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి దాటి తాము అప్పులు చేయడం లేదని పేర్కొన్నారు. స్పీకర్ అనుమతి ఇస్తే ఈ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ క్రమంలో హరీశ్‌రావుపై ఆగ్రహం ఫైర్ అయ్యారు. సత్యదూరమైన మాటలతో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. సభను తప్పుదోవ పట్టించొద్దని, గత ప్రభుత్వం లోపాలను ప్రజలకు తెలియజెప్పేందుకు తాము సిద్ధం ఉన్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూంలు ఇచ్చారా అని నిలదీశారు. తాము తీసుకున్న అప్పుల విషయంలో దాచుకోకుండా చెప్పామని, కానీ.. మీరు మాత్రం దాచిపెట్టారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.52వేల కోట్ల అప్పు చేసిందని భట్టి వివరించారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు రూ.1.27 లక్షల కోట్లు అబద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల్లోనే గడిచిన ఏడాది కాలంలో రూ.66 కోట్లు తీర్చామని చెప్పారు. రూ.40వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉండగా.. అందులో నేటికి రూ.20వేల కోట్లు క్లియర్ చేసినట్లు తెలిపారు. హరీశ్‌రావుకు ఏనాడూ నిజం చెప్పే అలవాటు లేదని భట్టి మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతుండగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డిప్యూటీ స్పీకర్ అంటూ తడబడ్డారు. వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కలగచేసుకొని.. డిప్యూటీ సీఎం అంటూ హరీశ్‌రావుకు గుర్తుచేశారు. ‘సారీ..’ అంటూ హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో భట్టి విక్రమార్క సీఎం అవుతారేమో.. మంచిదే కదా. సీఎం కావాలని కోరుకుంటున్నాము’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో సభ్యులు కాసేపు నవ్వుకున్నారు.