Begin typing your search above and press return to search.

త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. తెరపైకి కొత్త పేర్లు.. పదవులు

టి బీజేపీ చీఫ్ గా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న మురళీధర్‌ రావుకు తోడు సీనియర్ నాయకురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Feb 2025 11:43 AM GMT
త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. తెరపైకి కొత్త పేర్లు.. పదవులు
X

అదిగో తెలంగాణ.. ఇదిగో అధికారం అంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేసి.. తీరా ఎన్నికల వేళకు అధ్యక్షుడిని మార్చి.. మోస్తరు సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది బీజేపీ. అదే అధ్యక్షుడు (కిషన్ రెడ్డి) లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర మంత్రి అయి కూడా ఏడెనిమిది నెలలు అవుతోంది. కానీ, ఇంకా రాష్ట్ర పదవిలో కొనసాగుతున్నారు. ఆరు నెలల కిందటే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ అని ప్రచారం జరిగినా.. ఏదీ కొలిక్కిరాలేదు. మళ్లీ ఇప్పుడు సందడి మొదలైంది.

చడీచప్పుడు లేకుండా సోమవారం ఒకేసారి తెలంగాణలోని 27 జిల్లాలకు అధ్యక్షుడిని ప్రకటించేసింది బీజేపీ. ఇప్పుడు ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీనే మిగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు పేర్లు గట్టిగా వినిపించాయి. తాజాగా వీటికి మరికొన్ని తోడయ్యాయి. తెలంగాణ కమల దళపతి నియామకం ఈ నెల 15నాటికి పూర్తి అవుతుందని బీజేపీ వర్గాలు చెబుతుండగా కొత్త అధ్యక్షుడు ఎవరో? అనే సందిగ్ధం నెలకొంది.

ఈటలనా? సంజయా? అర్విందా?

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఎంపీలు ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి)ల పేర్లు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో మొన్నటివరకు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు పేరు కూడా బయటకు వచ్చింది. అయితే, అధ్యక్ష పదవి విషయంలో గతంలో పార్టీలో పాత, కొత్త అనే విభేదాలు వచ్చాయి. దీంతో అధిష్ఠానం మధ్యేమార్గం అన్వేషించింది. అధ్యక్ష పదవి కోసం తెరపైకి కొత్తపేర్లు వచ్చాయి.

ఆయనకా? ఆమెకా?

టి బీజేపీ చీఫ్ గా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న మురళీధర్‌ రావుకు తోడు సీనియర్ నాయకురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఇద్దరూ ఓసీలే. వీరిలో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తే బీసీ నేతను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేసే చాన్స్ ఉందని సమాచారం. కాగా, బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవిని వెలమ అయిన మురళీధర్ రావు కు ఇచ్చినా, రెడ్డి అయిన డీకే అరుణకు ఇచ్చినా.. బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది.

కాంగ్రెస్ తరహాలో..

తెలంగాణ కాంగ్రెస్ లో నాయకత్వ పోరును తీర్చేందుకు గతంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు బీజేపీలోనూ బీసీలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈటల లేదా అర్వింద్‌ లలో ఒకరికి ఇస్తారని చెబుతున్నారు. బీసీ నేతకు అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎవరూ ఉండరని బీజేపీ వర్గాలు తెలిపాయి.